Janareddy: చట్ట వ్యతిరేకం, సంప్రదాయ విరుద్ధం, చీకటిరోజు: జానారెడ్డి
- మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన జానారెడ్డి
- బడ్జెట్ సమావేశాల నుంచి వెళ్లగొట్టారు
- కుర్చీలోంచీ లేయని నన్ను సస్పెండెలా చేస్తారు?
- విపక్ష నేత జానారెడ్డి ప్రశ్నాస్త్రాలు
ఈ ఉదయం అసెంబ్లీలో సంప్రదాయాలకు విరుద్ధంగా, చట్ట వ్యతిరేకంగా మొత్తం ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేయడాన్ని అప్రజాస్వామిక చర్యగా కాంగ్రెస్ పక్ష నేత కే జానారెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన, సభ చరిత్రలో నిన్న చీకటి రోజని టీఆర్ఎస్ వ్యాఖ్యానిస్తుండటాన్ని తప్పుబట్టిన ఆయన, వాస్తవానికి నేడు చీకటిరోజని అన్నారు. నిన్నటి ఘటన గవర్నర్ పరిధిలో ఉన్న విషయమైనా, దానిపై కేసీఆర్ సర్కారు చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. నిన్న అసెంబ్లీ గవర్నర్ అధీనంలో ఉందని, నేడు మాత్రమే స్పీకర్ చేతుల్లోకి వస్తుందన్న సంగతిని కేసీఆర్ విస్మరించారని ఆరోపించారు. కనీసం సభను వీడేముందు తమకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలను చర్చించే ధైర్యం లేకనే, తమను బయటకు వెళ్లగొట్టారని, తూతూమంత్రంగా బడ్జెట్ ను ఆమోదించుకునేందుకు తమను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి వెళ్లగొట్టారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా సంయమనం పాటించిన తనను, తనతో పాటు కుర్చీలో నుంచి లేయను కూడా లేయని షబ్బీర్ అలీని సస్పెండ్ చేయడం ఏంటని జానా రెడ్డి ప్రశ్నించారు.