Harish Rao: గతంలో రోజా, కరణం బలరాంలపై ఇలాగే చేయలేదా?: హరీశ్ రావు
- అత్యున్నత హోదాలో ఉన్న గవర్నర్ పైనే దాడి
- సస్పెండ్ చేయడం తప్పెలా అవుతుంది?
- గతంలో ఇటువంటి చర్యలు తీసుకున్న చరిత్ర ఉంది
- శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్ రావు
రాజ్యాంగ పరిరక్షకుడిగా, అత్యున్నత హోదాలో ఉన్న గవర్నర్ పై దాడికి దిగి, మరో అత్యున్నత పదవిలో ఉన్న స్వామిగౌడ్ పై హత్యాయత్నం చేస్తే, వారిని సస్పెండ్ చేయడం తప్పెలా అవుతుందని తెలంగాణ నీటి పారుదల, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన, సభలో అనుచితంగా ప్రవర్తించిన వారిపై గతంలోనూ కఠిన చర్యలు తీసుకున్న సందర్భాలున్నాయని గుర్తు చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కరణం బలరాంపై ఇదే సభలో చర్య తీసుకున్నారని, పక్క రాష్ట్రంలో వైకాపా ఎమ్మెల్యే రోజా పైనా ఇదే తరహా చర్యలు తీసుకున్నారని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు రోజు స్పీకర్ స్వయంగా ప్రతిపక్ష నేతలకు ఫోన్ చేసి సహకరించాలని కోరారని, ఆయన మాటలను విపక్ష ఎమ్మెల్యేలు పెడచెవిన పెట్టారని ఆరోపించారు. సభ్యత్వం రద్దు అయిన వాళ్లు ఇక నుంచి మాజీలేనని స్పష్టం చేశారు.