airplane: సాంకేతిక లోపంతో ఎమర్జన్సీ ల్యాండింగ్.. భయంతో దూకేసిన ప్రయాణికులు!
- అమెరికాలోని అల్బక్వెర్‌క్యూ విమానాశ్రయంలో ఘటన
- ఏదో వాసన రావడంతో అత్యవసరంగా దింపిన పైలట్
- దాదాపు ఎనిమిది అడుగుల ఎత్తునుంచి దూకిన ప్రయాణికులు
- ఇద్దరికి గాయాలు
అమెరికాలోని అల్బక్వెర్‌క్యూ అంతర్జాతీయ సన్‌పోర్ట్ విమానాశ్రయంలో గత అర్ధరాత్రి అలజడి చెలరేగింది. అరిజోనాలోని ఫినిక్స్ నుంచి బయలుదేరిన డల్లాస్‌కు చెందిన 'సౌత్‌వెస్ట్ విమానం- 3562'లో ఏదో వాసన రావడంతో అల్బక్వెర్‌క్యూ విమానాశ్రయంలో దాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే భయాందోళనలకు గురైన ప్రయాణికులు.. విమానం ల్యాండ్ చేయగానే విమానం రెక్క పక్కనే ఉండే కిటికిలో నుంచి కిందకి దూకేశారు.
దాదాపు ఎనిమిది అడుగుల ఎత్తునుంచి ప్రయాణికులు దూకేయడంతో వారిలో ఇద్దరికి గాయాలయ్యాయి. సదరు విమానం ల్యాండ్ కాగానే విమాన సిబ్బంది అత్యవసర ద్వారం తెరిచి ప్రయాణికులంతా వెంటనే కిందకి దిగేయాలని సూచించడడంతో ప్రయాణికులు అందరూ ఒక్కసారిగా ఇలా దూకేశారని, వారంతా త్వరగా విమానం నుంచి బయటకు వచ్చేయడంతో ప్రమాదం తప్పిందని సంబంధిత అధికారులు చెప్పారు.