Jana Sena: ఇలాంటి ప్రచారాలను ఎవ్వరూ నమ్మొద్దు: జనసేన ప్రకటన
- మా పార్టీకి సంబంధించి కమిటీలపై వచ్చిన వార్తలు అవాస్తవం
- కమిటీల నియామకంపై ఇంకా కసరత్తు కొనసాగుతోంది
- మా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అధికారికంగా ప్రకటిస్తుంది
- ఏళ్ల తరబడి కష్టపడుతున్న నిజమైన కార్యకర్తలను పార్టీ గుర్తిస్తుంది
జనసేన పార్టీకి సంబంధించి కమిటీలపై వచ్చిన వార్తలు అవాస్తవమని జనసేన పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. కమిటీల నియామకంపై ఇంకా కసరత్తు కొనసాగుతోందని, తమ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అధికారికంగా ప్రకటిస్తుందని అందులో పేర్కొంది. ఇటువంటి ప్రచారాలన్నీ ఎవరూ నమ్మొద్దని, ఏళ్ల తరబడి కష్టపడుతున్న నిజమైన కార్యకర్తలను పార్టీ గుర్తిస్తుందని తెలిపింది.
పార్టీ శ్రేణులు ఎటువంటి గందరగోళానికి గురవ్వకూడదని మనవి చేసుకుంటున్నట్లు అందులో పేర్కొంది. కాగా, సోషల్ మీడియాలో జనసేన పార్టీపై పలు పుకార్లు వ్యాపిస్తున్నాయి. కొన్ని రోజులుగా జనసేన కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఫేక్ న్యూస్ ప్రచారం అయింది. కాగా, రేపు గుంటూరులో నిర్వహించనున్న జనసేన ఆవిర్భావం మహాసభకు సర్వం సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి సభ ప్రారంభం కానుంది.