Congress: దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలన్న కాంగ్రెస్ సభ్యుడు.. 28 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్!
- గుజరాత్ అసెంబ్లీలో గందరగోళం
- స్పీకర్ చెప్పినా వినిపించుకోని కాంగ్రెస్ సభ్యులు
- క్షమాపణతో వెనక్కి తగ్గిన స్పీకర్
గుజరాత్ అసెంబ్లీ నుంచి 28 మంది కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేశారు. పార్టీ సీనియర్ నేత విజ్రి తుమార్ను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. దీంతో స్పీకర్ రాజేంద్ర త్రివేదీ వారిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ చీఫ్ విప్ అమిత్ చవ్దా కల్పించుకుని సభ్యుల ప్రవర్తనకు క్షమాపణలు చెప్పడంతో సభ రెండో అర్ధ భాగంలో సస్పెన్షన్‌ను ఎత్తివేశారు.
వ్యవసాయశాఖా మంత్రి ఆర్సీ ఫాల్దు సభలో మాట్లాడుతుండగా కాంగ్రెస్ సభ్యులు కల్పించుకుని సభలో రగడ సృష్టించారు. గత 22 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క డ్యామ్ కూడా నిర్మించలేదని ఆరోపించారు. స్పందించిన మంత్రి తమ హయాంలో గత రెండు దశాబ్దాలుగా ప్రారంభించిన పలు సాగునీటి పథకాల గురించి వివరిస్తూ తుమార్ పేరును ప్రస్తావించడం గందరగోళానికి దారితీసింది. తుమార్ బెంచ్‌పైకి ఎక్కి మంత్రితో వాగ్వాదానికి దిగారు. బెంచ్ దిగాలంటూ స్పీకర్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఎమ్మెల్యే పెడచెవిన పెట్టడమే కాకుండా మంత్రిని దూషించారు. అంతేకాదు, దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని సవాలు విసిరారు.
15 మంది ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో కల్పించుకున్న స్పీకర్ మొత్తం 28 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. దీనికి నిరసనగా మిగతా ప్రతిపక్ష పార్టీల నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. మధ్యాహ్నం సభ ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ చీఫ్ విప్ చవ్దా తమ సభ్యుల ప్రవర్తనకు క్షమాపణలు చెప్పడంతో స్పీకర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.