Nirav Modi: పరువు తీసి పందిరెయ్యండి! బ్యాంకు రుణాలు ఎగ్గొట్టే వారి పేర్లు, ఫొటోలు ఇక దినపత్రికల్లో..
- రుణాలు ఎగ్గొట్టే వారిపై ఇక కఠిన చర్యలు
- వారు పరువును బజారున పెట్టాలని నిర్ణయం
- బ్యాంకులకు లేఖ రాసిన ప్రభుత్వం
బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో రుణాలు తీసుకుని ఆపై ఎగ్గొడుతున్న వారి పరువు తీసి పందిరేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ బ్యాంకులను ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా డిఫాల్టర్ల పేర్లు, ఫొటోలను దినపత్రిల్లో ప్రచురించాలని సూచించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు లేఖలు రాసింది. ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టే వారి పేర్లు, ఫొటోలను దినపత్రికల్లో ప్రచురించాలని అందులో పేర్కొంది.
గతేడాది డిసెంబరు చివరి నాటికి ఉద్దేశపూర్వకంగా బ్యాంకు రుణాలు ఎగ్గొట్టే వారి సంఖ్య 9,063కు చేరుకుంది. వీరు మొత్తం రూ.1,10,050 కోట్లు ఎగ్గొట్టినట్టు ఆర్థిక శాఖ సహాయమంత్రి శివ్ ప్రతాప్ శుక్లా లోక్సభకు తెలిపారు.
ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా రూ.50 కోట్లు అంతకంటే ఎక్కువ రుణాలు తీసుకునే వారి పాస్పోర్టు వివరాలు కూడా తీసుకోవాలని గతవారం ప్రభుత్వం బ్యాంకులను ఆదేశించింది. దీనివల్ల మోసగాళ్లపై సరైన సమయంలో చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. 45 రోజుల్లోపు పాస్పోర్టు వివరాలను సేకరించాలని ఆదేశించింది. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ మాల్యా, జతిన్ మెహతా తదితరులు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేయడంతో ఇకపై ఇటువంటివి జరక్కుండా ఉండేందుకు ప్రభుత్వం ఇటువంటి చర్యలు ప్రారంభించింది.