Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో సత్తా చాటుతున్న బీజేపీ!
- ప్రారంభమైన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు
- ఉత్తరప్రదేశ్లోని రెండు లోక్సభ స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థుల ముందంజ
- బీహార్లో రెండింటిలో ఆర్జేడీ, ఒకదాంట్లో బీజేపీ ముందంజ
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్, ఫల్పర్, బీహార్లోని అరారియా లోక్సభ స్థానాలతోపాటు బీహార్లోని భాబువా, జెహ్నాబాద్ అసెంబ్లీ స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, ఉత్తరప్రదేశ్లో బీజేపీ, బీహార్లో ఆర్జేడీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రిగా కేశవ్ ప్రసాద్ మౌర్యలను పార్టీ నియమించడంతో వారి స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇక, ఆర్జేడీ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎదుర్కొంటున్న తొలి ఉప ఎన్నికలు ఇవి. దీంతో అందరి దృష్టి ఈ ఫలితాలపై పడింది.
ఈ ఉదయం 8:26 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా ఉత్తరప్రదేశ్లోని ఫల్పర్, గోరఖ్పూర్ నుంచి బరిలో ఉన్న కౌశలేంద్ర సింగ్ పటేల్, ఉపేంద్ర దత్ శుక్లాలు ముందంజలో ఉన్నారు. బీహార్లోని అరారియా లోక్సభ, జెహ్నాబాద్ అసెంబ్లీ స్థానాల్లో ఆర్జేడీ ముందంజలో ఉండగా, భాబువా లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.