Uttar Pradesh: బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ... గోరఖ్ పూర్ లోనూ సమాజ్ వాదీ ఆధిక్యం!

  • అనూహ్యంగా గోరఖ్ పూర్ లో సమాజ్ వాదీ ఆధిక్యంలోకి
  • సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గంలో సమాజ్ వాదీ సత్తా
  • రౌండ్ రౌండ్ కూ మారుతున్న ఆదిక్యం
  • కొనసాగుతున్న కౌంటింగ్

ఉత్తరప్రదేశ్ లో ఉప ఎన్నికలు జరిగిన రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఫుల్ పూర్, గోరఖ్ పూర్ లలో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, రౌండ్ రౌండ్ కూ ఆధిక్యం మారిపోతోంది. ఇప్పటికే ఫుల్ పూర్ లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి సుమారు 13 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతూ విజయం దిశగా దూసుకుపోతుండగా, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గమైన గోరఖ్ పూర్ లోనూ సమాజ్ వాదీ పార్టీ ఆధిక్యంలోకి వచ్చింది. సమాజ్ వాదీ అభ్యర్థి అనూహ్యంగా లీడింగ్ లోకి వచ్చారు. తాజా గణాంకాల ప్రకారం, ఆయన తన సమీప ప్రత్యర్థి ఉపేంద్ర దత్ శుక్లా కన్నా 1523 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సమాజ్ వాదీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ నిషాద్ కు 44,979 ఓట్లు రాగా, శుక్లాకు 43,456 ఓట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఫుల్ పూర్ ఉప ఎన్నికల్లో ఎనిమిదో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి సమాజ్ వాదీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్ కు 99,557 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి కుశలేంద్ర సింగ్ పటేల్ కు 87,326 ఓట్లు వచ్చాయి. ఈ రెండు స్థానాల్లో విజయం తమదేనని సమాజ్ వాదీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News