RBI: పీఎన్బీ స్కాంతో ఆర్బీఐకి జ్ఞానోదయం...ఇకపై ఎల్ఓయూలు జారీ చేయరాదని బ్యాంకులకు ఆదేశం
- ఇకపై బ్యాంకులు ఎల్ఓయూలు/ఎల్ఓసీలు జారీ చేయరాదని ఆదేశం
- కొన్ని నిబంధనలకు లోబడి లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ) జారీ, బ్యాంకు హామీలు కొనసాగుతాయని వెల్లడి
- నిబంధనల్లో మార్పులతో ఎల్ఓయూ ఆధారిత వ్యాపారలపై ప్రభావం
ఢిల్లీకి చెందిన వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)ని వందల కోట్ల రూపాయల మేర ముంచేసిన ఘటనతో భారతీయ రిజర్వు బ్యాంకుకి జ్ఞానోదయం అయినట్లుంది. బ్యాంకులు ఇకపై లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ (ఎల్ఓయూలు) రూపంలో హామీలు ఇవ్వరాదని స్పష్టం చేసింది. "ప్రస్తుతం అమలవుతున్న మార్గదర్శకాలను సమీక్షించిన తర్వాత భారతదేశంలో దిగుమతుల కోసం వ్యాపార రుణాలకు వాణిజ్య బ్యాంకులు ఎల్ఓయూలు/ఎల్ఓ సీలు(లెటర్స్ ఆఫ్ కంఫార్ట్లు) జారీ చేసే సంప్రదాయానికి తక్షణమే స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకున్నాం. అదే సమయంలో వ్యాపార రుణాలకు సంబంధించి లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ) జారీ, బ్యాంకు హామీలు లాంటివి కొన్ని కచ్చితమైన నిబంధనలకు లోబడి కొనసాగుతాయి" అని ఆర్బీఐ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
బ్యాంకుల రుణ వితరణ విధానాల్లో ఆర్బీఐ చేసిన తాజా మార్పులతో దిగుమతి ఆధారిత వ్యాపారాలతో పాటు బ్యాంకు హామీలను పొందేందుకు ఉద్దేశించిన ఎల్ఓయూలపై తరచూ ఆధారపడే వర్తకాలపై ప్రభావం పడే అవకాశముంది. కాగా, నీరవ్ మోదీ పీఎన్బీ నుంచి ఎల్ఓయూలను తీసుకోవడం మార్చి, 2011 నుంచి మొదలుపెట్టారు. ఎల్ఓయూలతో ఆయన సదరు బ్యాంకును దాదాపు రూ.13000 కోట్ల వరకు ముంచినట్లు దర్యాప్తు సంస్థల అధికారులు అంచనా వేశారు.