stefen hwakings: చావంటే భయంలేదు... చావడానికి ముందు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి: స్టీఫెన్ హాకింగ్స్
- స్వర్గమనేది కట్టుకధ
- మరణించిన తరువాత జీవితం లేదు
- ఇతిహాసాల్లో పేర్కొన్నవి చావంటే భయపడే వారి కోసం రాసిన కట్టుకథలు
ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ మరణం సోషల్ మీడియాలో ఆయన అభిమానులకు శరాఘాతంలా తగిలింది. దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో రిప్ సందేశాలతో ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు ఆయన మరణం గురించి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకుంటున్నారు. చివరి వరకు తీవ్ర అనారోగ్యంతో బాధపడిన ఆయన మరణంపై మాట్లాడుతూ, మరణం తరువాత జీవితం లేదన్నారు. స్వర్గమనేది కట్టుకథ అని కొట్టిపడేశారు. మరణం తరువాత జీవితం, స్వర్గం, నరకం వంటివి ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు. ఇతిహాసాల్లో పేర్కొన్నవన్నీ మృత్యువంటే భయపడేవారి కోసం అల్లిన కట్టుకథలని ఆయన తేల్చి చెప్పారు.
మనిషి మెదడు కూడా కంప్యూటర్ లాంటిదేనని పేర్కొన్న ఆయన, భాగాలు పాడైన తరువాత కంప్యూటర్ పనిచేయనట్టే మెదడు కూడా పనిచేయడం ఆగిపోతుందని ఆయన చెప్పారు. ఒక్కసారి మెదడు పని చేయడం ఆగిపోతే ఇక చేయగలిగిందేమీ లేదని అన్నారు. ఆ లోపే మనకున్న శక్తిసామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. గడచిన 49 ఏళ్లుగా మృత్యువు తనతో దోబూచులాడుతోందని ఆయన అన్నారు. తనకు మృత్యువంటే భయం లేనప్పటికీ... మరణించేలోపు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతిధ్వనిస్తున్నాయి.