Tejas express: తేజాస్, శతాబ్ది రైళ్లలో ఇక సినిమాల ప్రదర్శన ఉండదు...కారణం మాత్రం ప్యాసింజర్లేనట?

  • తేజాస్, శతాబ్ది రైళ్లలో ఎల్‌సీడీ తెరలను ప్యాసింజర్లు ధ్వంసం చేసినట్లు గుర్తింపు
  • ఈ రైళ్లలో ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ సెట్లను పూర్తిగా తొలగించాలని జోనల్ రైల్వేలకు ఆదేశం
  • కానీ, అన్ని రైళ్లలో ఉచిత వైఫై అందించేందుకు యోచన

ముంబై-గోవా మధ్య తిరిగే తేజాస్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రయాణించే శతాబ్ది రైళ్లలోని సీట్ల వెనుక అమర్చిన ఎల్‌సీడీ తెరలపై ఇప్పటివరకు మనం సినిమాలను వీక్షించేవాళ్లం..పాటలు వినేవాళ్లం, బోర్ కొట్టినప్పుడు వీడియో గేమ్స్ కూడా ఆడేవాళ్లం. కానీ ఇకపై ఇవన్నీ గతం. ఆ రెండు రైళ్లలో ఇలాంటి వినోద కార్యక్రమాలను నిలిపేయాలని రైల్వే శాఖ నిర్ణయించుకుంది. ప్యాసింజర్లు ఈ రైళ్లలోని బోగీల్లో ఏర్పాటు చేసిన ఎల్‌సీడీ తెరలను ధ్వంసం చేయడం, వైర్లను తెంపివేయడం, హెడ్‌ఫోన్లను మాయం చేయడం, పవర్ స్విచ్‌లను తొలగించినట్లు రైల్వే శాఖ అధికారులు గుర్తించారు. అందువల్ల ఈ రెండు రైళ్లలోని బోగీల నుంచి ఎల్‌సీడీ తెరలను పూర్తిగా తొలగించాలని నిర్ణయించుకుంది.

శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లోని 'అనుభూతి' కోచ్‌లలోనూ ఈ తెరలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు రైళ్లలోని బోగీల్లో ఎల్‌సీడీ సెటప్‌ను ప్యాసింజర్లు అన్ని రకాలుగా నాశనం చేసినందు వల్ల ఇకపై వీటిలో వినోద కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రైళ్లలోని ఎల్‌సీడీ తెరలను తొలగించమంటూ అన్ని జోనల్ కార్యాలయాలకు గతనెలలోనే ఆదేశాలు జారీ చేశామని, త్వరలోనే తొలగింపు పనులు మొదలవుతాయని రైల్వే బోర్డు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఎల్‌సీడీ, ఎల్ఈడీ తెరలను బోగీల నుంచి తొలగించినప్పటికీ, అన్ని రైళ్లలో ఉచిత వైఫైని అందించేందుకు యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. వైఫై సదుపాయం ప్రస్తుతానికి ప్రధాన రైళ్లలో మాత్రమే అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News