mohammad shami: షమీ ఫిక్సింగ్ కి పాల్పడ్డాడా?... బీసీసీఐ విచారణ

  • టీమిండియా పేసర్ షమీపై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం దర్యాప్తు
  • వారం రోజుల్లో నివేదిక కోరిన సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్
  • షమీ, హసీన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు విన్నాం

టీమిండియా పేసర్ మొహమ్మద్‌ షమీని మరిన్ని కష్టాలు చుట్టుముట్టనున్నాయా?, వివాహ బంధంలో విభేదాల నేపథ్యంలో షమీ భార్య హసీన్ జహాన్ చేసిన ఆరోపణలు షమీ మెడకు చుట్టుకున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. షమీకి వివాహేతర సంబంధాలు ఉన్నాయని, వేధింపులకు గురి చేశాడని, హింసిస్తున్నాడని, చాలా ఆరోపణలు ఉన్నప్పటికీ.. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణను బీసీసీఐ సీరియస్ గా తీసుకుంది.

 ఇతర ఆరోపణలపై కోల్ కతా పోలీసులు షమీపై 498 (ఏ), 323, 307, 376, 506, 328 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, ఫిక్సింగ్ ఆరోపణలను బీసీసీఐ విచారణ కమిటీ దర్యాప్తు చేయనుంది. ఈ మేరకు హసీన్‌ చేసిన ఆరోపణల్లో ‘టెలిఫోన్‌ సంభాషణ’పై విచారణ జరపాలని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్‌ నీరజ్‌ కుమార్‌ ను సీఓఏ చైర్మన్‌ వినోద్‌ రాయ్‌ ఆదేశించారు. విచారణను కేవలం వారంరోజుల్లో ముగించి, నివేదిక అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు. సీఓఏ ఎక్కడా మ్యాచ్ ఫిక్సింగ్ అన్న పదాన్నివాడకుండానే విచారణకు ఆదేశించడం విశేషం.

ఇంగ్లండ్‌ కు చెందిన వ్యాపారవేత్త మొహమ్మద్‌ భాయ్‌ చెప్పడంతో అలీస్బా అనే పాకిస్తాన్‌ మహిళ నుంచి షమీ డబ్బులు తీసుకున్నాడన్న సందర్భంలో షమీ, అతని భార్య మధ్య జరిగిన ఫోన్ సంభాషణను విన్నామని, బయట కూడా ఆ ఫోన్ సంభాషణ అందుబాటులో ఉందని వినోద్ రాయ్ తెలిపారు. ఈ కేసులో ఇతర అంశాల జోలికి వెళ్లదల్చుకోలేదన్న ఆయన, కేవలం మొహమ్మద్‌ భాయ్, అలీస్బాలు ఎవరు?, వారి నుంచి షమీ నిజంగానే డబ్బులు తీసుకున్నాడా?, తీసుకుంటే ఎంత?, ఎందుకు తీసుకున్నాడు? అన్న విషయాలపై విచారణ చేయనున్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News