TTD: పవన్ ఆరోపణల్లో నిజం లేదు.. లోకేశ్‌ను నేనెప్పుడూ కలవలేదు: జనసేన చీఫ్‌పై శేఖర్‌రెడ్డి ఫైర్
- పవన్ ఆరోపణలు కొట్టిపడేసిన శేఖర్‌రెడ్డి
- ఏడాదికి రూ.100 కోట్ల ఆదాయం ఉన్న తనకు ఎవరి సాయమూ అక్కర్లేదని వ్యాఖ్య
- తన పేరు పలికితే శుభం జరుగుతుందనే పవన్ ఆరోపణలు చేసి ఉండొచ్చంటూ ఎద్దేవా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలపై తమిళనాడుకు చెందిన మైనింగ్ వ్యాపారి శేఖర్‌రెడ్డి స్పందించారు. లోకేశ్‌కు శేఖర్‌రెడ్డితో సంబంధాలున్నాయని, ఆ విషయం మోదీకి తెలుసనే చంద్రబాబు భయపడుతున్నారని పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్పందించిన శేఖరరెడ్డి ఓ పత్రికతో మాట్లాడుతూ పవన్ ఆరోపణలు వాస్తవ విరుద్ధమని కొట్టిపడేశారు. తాను వస్తే మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో తమిళనాడులో పోటీచేసే నాయకులు తనను పిలుస్తారని, తన పేరు పలికితే జనసేనకు కూడా శుభం జరుగుతుందన్న ఉద్దేశంతోనే పవన్ తన పేరును ప్రస్తావించి ఉంటారని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబును తాను ఇప్పటి వరకు రెండుసార్లు మాత్రమే కలిశానని, లోకేశ్‌ను ఇప్పటి వరకు చూడలేదని స్పష్టం చేశారు. తనను టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించినప్పుడు ఓసారి, చంద్రబాబు తిరుపతి వచ్చినప్పుడు మరోసారి ఆయనను కలిశానన్నారు. తర్వాత మరెప్పుడూ కలవలేదన్నారు. అయినా తమిళనాడులో ఉండే వారికి ఏపీ రాజకీయ నాయకులతో పనేముంటుందని ప్రశ్నించారు. అసలు ఏపీలో తనకు ఎటువంటి వ్యాపారాలు లేవన్నారు.
500 లారీలు, 700 పొక్లెయిన్లు ఉన్న తనకు ఏడాదికి రూ.100 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని, అటువంటి తాను సాయం అడుక్కోవడం ఏమిటని శేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. తాను సాయం చేస్తాను తప్పితే, ఇతరుల సొమ్ము తన వద్ద ఎందుకు ఉంచుకుంటానని నిలదీశారు. తనను తమిళనాడు కోటా నుంచే నియమించారని, అప్పటి ముఖ్యమంత్రి జయలలిత తన పేరును సిఫారసు చేశారని వివరించారు.