Warangal Urban District: వరంగల్ నిట్ లో చిత్రం...మొన్న విద్యార్ధుల కత్తి యుద్ధం...నిన్న ప్రొఫెసర్ల బాహాబాహీ
- వసంతోత్సవం సందర్భంగా కత్తులతో దాడులు చేసుకున్న విద్యార్థులు
- వైవా సందర్భంగా స్టూడెంట్స్ ముందే ఘర్షణపడ్డ మెకానికల్ విభాగం ప్రొఫెసర్లు
- బాహాబాహీకి దిగిన ప్రొఫెసర్లకు సర్ది చెప్పిన సహచరులు
వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) లో రోజుకొక ఘర్షణ కలకలం రేపుతోంది. నిట్ వసంతోత్సవ వేడుకల సాక్షిగా విద్యా ర్థుల మధ్య ఘర్షణ తలెత్తి పరస్పరం కత్తులతో దాడులు చేసుకుని, గాయపడిన విద్యార్థులు కోలుకోకముందే అధ్యాపకులు హోదా మరిచి బాహాబాహీకి దిగడం కలకలం రేపుతోంది. దాని వివరాల్లోకి వెళ్తే... మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ స్కాలర్ విద్యార్థులకు వైవా పరీక్షలను ఆ విభాగం ప్రొఫెసర్ సాయి శ్రీనాథ్ నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షను పరిశీలించేందుకు మెకానికల్ విభాగాధిపతి బంగారు బాబు పరీక్ష హాలుకు వచ్చారు. వస్తూనే వైవాకు హాజరైన విద్యార్థులపై పలు ప్రశ్నలు సంధించారు.
అనంతరం శ్రీనాథ్ వైపు తిరిగి ‘ఇప్పటివరకు.. వీరికి నువ్వు ఏం నేర్పించావ్?’ అంటూ విద్యార్థుల ముందే ప్రశ్నించారు. దీంతో ‘విద్యార్ధులు సరిగానే సమాధానం ఇచ్చారు కదా’ అంటూ శ్రీనాథ్ సమాధానం చెప్పారు. ఇది వాగ్వాదానికి దారితీసింది. దీంతో ఇద్దరూ బాహాబాహీకి దిగారు. ఇది చూసిన స్కాలర్లు అవాక్కయ్యారు. అనంతరం వారిద్దరూ పరస్పరం కాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇంతలో అక్కడికి చేరుకున్న ఇతర అధ్యాపకులు వివాదం స్టేషన్ వరకు వెళ్తే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సర్ది చెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ప్రొపెసర్ల గొడవపై సమాచారం అందింది తప్ప ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.