akhilesh yadav: అఖిలేష్ కోసం మెర్సిడెస్ బెంజ్ కారు పంపిన మాయావతి... బీఎస్పీ, ఎస్పీ చీఫ్ ల తొలి భేటీ
- యూపీ ఎన్నికల్లో ఉమ్మడి విజయమే భేటీకి ఆధారం
- బీఎస్పీ మద్దతు వల్లే రెండు లోక్ సభ స్థానాల్లో ఎస్పీ విజయం
- మాయావతికి అఖిలేష్ అభినందనలు
బీజేపీపై వ్యతిరేకత, పోరాటం ఈ రెండు అంశాలు ఉత్తరప్రదేశ్ లో చిరకాల ప్రత్యర్థులైన ఎస్పీ, బీఎస్పీలను ఏకం చేశాయి. ఫలితంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఖాళీ చేసిన గోరఖ్ పూర్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఖాళీ చేసిన ఫూల్పూర్ లోక్ సభ స్థానాల ఉప ఎన్నికల్లో ఎస్పీ ఘన విజయం సాధించింది. ఇక్కడ ఎస్పీ అభ్యర్థులకు బీఎస్పీ మద్దతు పలకడమే బీజేపీ ఓటమికి దారితీసింది. ఈ విజయం బీఎస్పీ అధినేత్రిర మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ లకు ఎంతో ఉత్సాహాన్ని, నైతిక స్థైరాన్ని ఇచ్చాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అయితే, నిన్న రెండు లోక్ సభ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత మాయావతి స్వయంగా మెర్సిడెస్ బెంజ్ కారును అఖిలేష్ కు పంపగా, ఆ కారులో అఖిలేష్ మాయావతి నివాసానికి వెళ్లి భేటీ కావడం ఆసక్తికరం. ఇది అప్పటికప్పుడు చోటు చేసుకున్న పరిణామం. ఫలితాల అనంతరం అఖిలేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగానే బీఎస్పీకి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం బీఎస్పీ సీనియర్ నాయకుడు ఒకరు అఖిలేష్ కు కాల్ చేసి శుభకాంక్షలు తెలిపారు. మాయావతి మీతో భేటీ అవ్వాలనుకుంటున్నట్టు చెప్పారు. దాంతో అఖిలేష్ బీఎస్పీ అధినేత్రితో ఫోన్లో మాట్లాడి కలుస్తానని చెప్పడం, ఆమె కారు పంపడం జరిగిపోయాయి. సాయంత్రం 7 గంటల సమయంలో ఇద్దరు అగ్రనేతల సమావేశం గంట పాటు జరిగింది.