gst: ప్రపంచంలో అతిపెద్ద పన్నురేటు జీఎస్టీ
- 115 జీఎస్టీ దేశాల్లో అధ్యయనం చేసిన వరల్డ్ బ్యాంక్
- ఒకే శ్లాబు విధానం కలిగిన దేశాలు 49
- రెండు శ్లాబులు కలిగి ఉన్న దేశాలు 28
- నాలుగు అంతకంటే ఎక్కువ శ్లాబువిధానం కలిగిన దేశాలు ఐదే
ప్రపంచ దేశాల్లో అత్యధిక పన్ను రేటు కలిగిన దేశంగా ఇండియా ఉందని వరల్డ్ బ్యాంకు పేర్కొంది. జీఎస్టీ పన్ను విధానం కలిగిన 115 దేశాల పన్ను చెల్లింపుల విధానాలను అధ్యయనం చేసిన తరువాత వరల్డ్ బ్యాంక్ ఈ ప్రకటన చేయడం విశేషం. కాగా, ఏకీకృతపన్ను విధానం పేరిట ప్రతిష్ఠాత్మకంగా ప్రధాని నరేంద్ర మోదీ గత జూలై 1 నుంచి జీఎస్టీని అమలులోకి తెచ్చారు. దీనిపై వరల్డ్ బ్యాంక్ పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
జీఎస్టీ విధానం చాలా క్లిష్టమైనదని పేర్కొన్న వరల్డ్ బ్యాంక్, ప్రపంచంలో రెండో అతిపెద్ద పన్ను రేటు భారత్ దేనని స్పష్టం చేసింది. జీఎస్టీలో భాగంగా భారత్ లో ప్రస్తుతం ఐదు పన్ను శ్లాబులున్నాయని తెలిపింది. 0 శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం పన్ను విధానాలు అమలులో ఉన్నాయని చెప్పింది. ఈ ఐదు శ్లాబులు కాకుండా బంగారానికి ప్రత్యేకంగా 3 శాతం పన్ను విధానం, విలువైన రాళ్లకు 0.25 శాతం పన్ను విధానం అమలులో ఉందని వరల్డ్ బ్యాంక్ తెలిపింది.
జీఎస్టీ నుంచి ఆల్కాహాల్, పెట్రోలియం, స్టాంపు డ్యూటీలు, రియల్ ఎస్టేట్, ఎలక్ట్రిసిటీ డ్యూటీలను మినహాయించారని గుర్తుచేసింది. జీఎస్టీని ప్రపంచ వ్యాప్తంగా అమలు చేస్తున్న దేశాల్లో 49 దేశాలు ఒకే శ్లాబును కలిగి ఉన్నాయని చెప్పింది. మరో 28 దేశాలు రెండు శ్లాబులను కలిగి ఉన్నాయని తెలిపింది. కేవలం భారత్ తో కలిపి ఐదు దేశాలే నాలుగు లేదా అంతకంటే ఎక్కువ జీఎస్టీ శ్లాబులు కలిగి ఉన్నాయని వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది. ఇందులో కూడా ప్రపంచ దేశాల్లో అత్యధిక పన్ను రేటు కలిగిన దేశంగా ఇండియా ఉందని వరల్డ్ బ్యాంక్ ప్రకటించింది.