Congress: చంద్రబాబుకు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఐదు ఉత్తరాలు
- స్థానికేతర ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
- డీఎస్సీ పీఈటీ పోస్టుల పెంపుదల చేయాలి
- రజక వృత్తిదారులకు సామాజిక భద్రత కల్పించాలి
- సర్వ శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ పని చేస్తోన్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
- పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఐదు అంశాలపై ఐదు ఉత్తరాలు రాశారు. విభజన నేపథ్యంలో అన్యాయానికి గురై ఇబ్బందులు పడుతున్న తెలంగాణ స్థానికేతర ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారించాలని మొదటి దాంట్లో ఉండగా, 2018 సంవత్సరంలో డీఎస్సీ పీఈటీ పోస్టుల పెంపుదల కోరుతున్నట్లు రెండో ఉత్తరంలో ఉంది. ఇక మూడో ఉత్తరంలో రజక వృత్తిదారులకు సామాజిక భద్రత కల్పించాలని, వారి సంక్షేమానికి రజక ఫెడరేషన్ కు బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించాలని ఉంది. నాలుగో ఉత్తరంలో సర్వ శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ పని చేస్తోన్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రెగ్యులరైజ్ చెయ్యాలని కోరుతూ ఉంది. చివరి ఉత్తరంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఉంది.
ఆయన రాసిన ఉత్తరాలు యథాతథంగా..
1) గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి,
విషయం: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల బదిలీల విషయంలో అన్యాయానికి గురై ఇబ్బందులు పడుతోన్న ఆంధ్ర ప్రదేశ్ స్థానికత కలిగి తెలంగాణాలో పనిచేస్తున్న స్థానికేతర ఉపాధ్యాయుల అసోసియేషన్ నుండి నాకు వచ్చిన విన్నపంపై రాస్తున్న లేఖ...
విభజన అనంతరం సహజంగానే తలెత్తే కొన్ని సమస్యలను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో, విజ్ఞతతో ఎలా పరిష్కరించుకోవాలో, అలా కుదరని పక్షంలో కేంద్ర ప్రభుత్వ జోక్యంతో ఎలా సరిచేసుకోవాలో ఏపీ పునర్విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమమైన, సానుకూలమైన ధోరణితో వ్యవహరించక పోవటం, మరో వైపు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపకపోవటం వల్ల కోతిపుండు బ్రహ్మరాక్షసి ఐన చందంగా అనేక సమస్యలు వికృత రూపం దాల్చాయి. అలాంటి సమస్యల్లో ఇది ఒకటి. కానీ ఇది చాలా చిన్న విషయం.
కాస్త దృష్టి సారిస్తే తేలిగ్గానే పరిష్కారమయ్యే సమస్య ఇది. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టికల్ 371 డీ ప్రకారం స్థానికేతర 20% కోటాలో తెలంగాణ జిల్లాలలో ఉద్యోగంలో చేరిన ఆంధ్ర ప్రాంత ఉపాధ్యాయులు సుమారు 426 మంది, ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలలో చేరిన తెలంగాణ ప్రాంతం వారు సుమారు 200 మంది ఉన్నారు. మారిన పరిస్థితుల్లో ఈ రెండు గ్రూపుల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం వారు వ్యక్తిగత ఇబ్బందులతో పాటు బీసీ రిజర్వేషన్ సౌకర్యం కోల్పోవటం వంటి తీవ్ర సమస్యలకు గురవుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం, ప్రజలు ఉద్యోగుల సమస్యల పట్ల ప్రదర్శిస్తున్న ఉదాసీన వైఖరి వీరికి శాపంగా మారింది. ప్రత్యేక పరిస్థితులు ఉన్న సమయంలో కూడా ప్రభుత్వం పూనుకొని ఇంత చిన్న సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకపోతే బాధితులకు ఇక దిక్కెవరు?
ఈ సమస్య పరిష్కారానికి పెద్ద ఖర్చు కానీ, కష్టం గానీ అవసరం లేని కారణంగా ప్రభుత్వం వెంటనే ఈ బాధితుల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
2) గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి,
విషయం: 2018 సంవత్సరంలో డీఎస్సీ పీఈటీ పోస్టుల పెంపుదల కోరుతూ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ వ్యాయామ విద్య పోరాట సమితి ఆధ్వర్యంలో వ్యాయామ విద్యనభ్యసించిన వేలాది మంది నిరుద్యోగులు చేసుకున్న విన్నపం మేరకు మీకు ఏపీసీసీ తరఫున రాస్తున్న లేఖ..
శారీరక, మానసిక ఆరోగ్యం కోసం వ్యాయామానికి ఉన్న ప్రాధాన్యత మీకు తెలియనిది కాదు. మీరు అనేక సందర్భాలలో మీ ఆరోగ్యానికి, ఉల్లాసానికి కారణం మీరు చేసే వ్యాయామమే అని చెప్పారు. అలాగే పలువురు యోగా గురువులను నెత్తిన పెట్టుకొని పూజించటం, వారికి ప్రభుత్వం నుంచి ఎన్నో ప్రయోజనాలు, ప్రోత్సాహకాలు ఇవ్వటం కూడా జగద్విదితమే. అలాంటిది మీకు భావి భారత పౌరులయిన మన బాలబాలికలకు, విద్యార్థులకు వ్యాయామ శిక్షణ ఆవశ్యకతను గురించి గుర్తు చేయవలసి రావటం ఒకింత బాధాకరమే.
ఐతే ఈ రోజు అనేక ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు శాస్త్రీయంగా వ్యాయామ శిక్షణ గరిపే ఉపాధ్యాయులు లేరన్నది పచ్చి నిజం. సరైన ఆట స్థలాలు లేవన్నది కూడ మరో వాస్తవం. ఈ కారణంగా బాల బాలికలకు అత్యావశ్యకమైన వ్యాయామం లేకపోవడంతో ఎన్నో రకాల శారీరక, మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. మరో పక్క వ్యాయామ విద్యనభ్యసించిన వేలాది మంది యువకులు నిరుద్యోగులుగా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండగా 'బాబు వస్తే జాబు' వస్తుందని ఇచ్చిన నినాదాలు, గోడల మీద రాసిన రాతలు ఈ నాలుగేళ్ల మీ పాలనలో నీటి మీద రాతలు గానే మిగిలిపోయాయి. ఉద్యోగాల కోసం నిరీక్షిస్తూ, జీవనోపాధి కరువై ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది నిరుద్యోగుల్లో వీరూ ఒక భాగం.
వ్యాయామం చేయడం గురించి ఎంతో చెప్పే మీ ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతుందని నిరీక్షించి, నిరీక్షించి విజ్ఞప్తులు చేసీ చేసీ విసిగిపోయి నేడు ఆందోళన బాట పట్టారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని, దీనికి సంబంధించిన జీవో నెం.29 ని సక్రమంగా అమలు చేయాలని, ప్రైవేటుతో సహా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలని వారు కోరుతున్న దాంట్లో న్యాయముంది. రుగ్మతలు లేని భావిభారత పౌరులను తీర్చిదిద్దటానికి వ్యాయామ శిక్షణ ఎంతో అవసరం అని వారు చెబుతున్న దానిలో విజ్ఞత ఉంది.
మీరు కూడా అంతే విజ్ఞతతో ఈ సమస్యను పరిష్కరించి ఈ నిరుద్యోగులకు న్యాయం చేయటంతో పాటు లక్షలాది మంది విద్యార్థులు, యువకులకు మేలు చేస్తారని ఆశిస్తున్నాం.
3) గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి,
విషయం: రజక వృత్తిదారులకు సామాజిక భద్రత కల్పించటం, వారి సంక్షేమానికి ఏర్పాటైన రజక ఫెడరేషన్ కు బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించటం తదితర రజక కులస్తుల డిమాండ్ల పరిష్కారం కొరకు ఆంధ్ర ప్రదేశ్ రజక వృత్తి దారుల సంఘం నుండి మాకు వచ్చిన విన్నపం ఆధారంగా రాస్తున్న లేఖ..
మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు "వస్తున్నా మీకోసం" అంటూ చేసిన పాదయాత్రలో బీసీల కోసం 18 ప్రధాన అంశాలతో ఒక బీసీ డిక్లరేషన్ చేశారు. దానిలో రజక కులస్తుల సామాజిక హోదాను మార్పు చేసి ఎస్సీ జాబితాలో చేరుస్తానని వాగ్దానం చేశారు. అలాగే 2014 టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో దేశ వ్యాప్తంగా17 రాష్ట్రాలలో రజకులు ఎస్సీలుగా ఉన్నందున మన రాష్ట్రంలో కూడా రజకులను ఎస్సీలుగా గుర్తించుటకు చర్యలు తీసుకుంటామని, జీవో 25 ప్రకారం జిల్లా రజక సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేస్తామని, బట్టల ఇస్త్రీకి వాడే ముడి సరుకులు సబ్సిడీపై సరఫరా చేస్తామని, ఆధునిక పనిముట్లను 50 శాతం సబ్సిడీతో సరఫరా చేస్తామని, జీవో 27 అమలు చేసి ప్రభుత్వ రంగ సంస్థల్లో రజకులకు ఉద్యోగాలు కల్పిస్తామని అనేక వాగ్దానాలు చేశారు.
మీరు అధికారం చేపట్టి 4 ఏళ్లు కావస్తున్నా ఇచ్చిన హామీలను నిజాయతీగా, నిబద్ధతతో నెరవేర్చే ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. అవే వాగ్దానాలను అమలు చేయమని రజక వృత్తి దారుల సంఘాలు అనేక సార్లు విజ్ఞప్తులు చేసినా తమ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. రాష్ట్రంలో సుమారు 20 లక్షల జనాభా కలిగిన రజక కులస్తుల కోసం ఏర్పాటు చేసిన రజక ఫెడరేషన్ కోసం కేవలం 36 కోట్లు కేటాయించటం హాస్యాస్పదం. అంత తక్కువ కేటాయింపుల వల్ల, సబ్సిడీ రుణాలకు బ్యాంకు లింక్ వల్ల రజక సొసైటీలకు రుణాలు అందటం లేదు. గ్రామాలలో రజకులపై దాడులు, రజక స్త్రీలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. పూర్వం గ్రామ రికార్డుల్లో 'చాకలి కుంటలు' గా ఉన్న వాటిని 'కుంటలు' గా మార్చి పెత్తందార్లు ఆక్రమించు కుంటున్నారు. గ్రామాల్లో వారు రక్షణ సమస్య,ఉపాధి సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో వారు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, నిరసనలు, నిరాహార దీక్షలు మొదలైన ఆందోళనలు చేపట్టారు. రక్షణ కోసం, పెన్షన్ ల కోసం, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ధోభి పోస్టుల భర్తీ కోసం, విద్యావకాశాల కోసం, సబ్సిడీ రుణాల సులభ పంపిణీ కోసం, చెరువుల కబ్జాల నివారణ కోసం, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కోసం, జిల్లా వెల్ఫేర్ కమిటీలు ఏర్పాటు చేసి రజకుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని వారు చేస్తున్న అభ్యర్థనల్లో న్యాయం ఉంది. ముఖ్యంగా రజక ఫెడరేషన్ కు బడ్జెట్లో అధిక కేటాయింపులు (1000 కోట్లు) డిమాండ్ గొంతెమ్మ కోరికేమీ కాదు.
సమాజంలో దళితులతో సమానంగా వివక్షకు, నిరాదరణకు, పేదరికానికి గురవుతున్న రజక కులస్తులకు ఆమాత్రం చేయటం ప్రజా ప్రభుత్వాల కనీస బాధ్యత అని నా అభిప్రాయం. తమది బీసీ పార్టీగా పదే పదే చెప్పుకునే మీపై మరింతగా ఆ బాధ్యత లేదా? అంతేకాదు, మీరు బీసీ డిక్లరేషన్ లో వాగ్దానం చేసిన విధంగా బీసీలకు ప్రణాళికా వ్యయంలో 25% నిధులను చిత్తశుద్ధితో కేటాయించినట్లయితే రజకుల ఈ డిమాండ్ ను అమలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు.
కనుక రజక సంఘాల పైడిమాండ్లపై సానుకూలంగా స్పందించి అత్యంత వెనుకబడిన రజకుల సంక్షేమానికి మీ ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.
4) గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి,
విషయం: సర్వ శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రెగ్యులరైజ్ చెయ్యాలని కోరుతూ వారి జేఏసీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన విన్నపంపై రాస్తున్న లేఖ...
వీరి కోరికలు చాలా న్యాయమైనవి, సమంజసమైనవి. మీ పాదయాత్రలో, 2014 ఎన్నికల ప్రచారంలో, టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇంటికొక ఉద్యోగం ఇస్తామని వాగ్దానం చేశారు. నిరుద్యోగులతో పాటు ఇటువంటి కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగుల్లో కూడా ఎన్నో ఆశలు కల్పించారు. "జాబు రావాలంటే బాబు రావాలి" అని మీరిచ్చిన నినాదం మీరు అధికారంలోకి రావడంతో సాకారం అవుతుందని వీరంతా ఆశించారు. కానీ అధికారం చేపట్టి నాలుగేళ్లు కావస్తున్నా ఆ వాగ్దానాలన్నీ ఎండమావులు గానే మిగిలి పోయాయి. ఎన్నాళ్లు ఎదురు చూసినా, ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా మీకు చీమ కొట్టినట్టయినా లేకపోవటం శోచనీయం.మీరిచ్చిన వాగ్దానాలు కనీసం మీకు గుర్తే లేనట్టు ఉన్న స్థితిలో వారికి ఆందోళన బాట పట్టటం తప్ప వేరే గత్యంతరం లేక పోయింది.
సర్వ శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ పనిచేస్తున్న అన్ని రకాల ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి వారికీ ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయకుండా కాంట్రాక్టు, పార్ట్ టైం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల వివక్ష చూపటం సరికాదు. అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ తో సహా వారి న్యాయమైన కోరికలన్నీ నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీనుండి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీ నుంచి సానుకూల స్పందన ఆశిస్తున్నాం.
5) గౌరవ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి,
విషయం: అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపటం గురించి..
మార్చి 16వ తేది అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి అన్న విషయం తెలిసిందే. ఆ త్యాగధనుడి అకుంఠిత దీక్ష, ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా అర్పించిన వారి అమరత్వం వల్లనే 1953లో తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. అంతే కాదు ఆయన చేసిన త్యాగం రగిలించిన స్ఫూర్తితోనే అనేక చోట్ల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు ఊపందుకొని అది మొదటి రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ( First SRC) ఏర్పాటుకు దారి తీసి ఆ తర్వాత ఎన్నో కొత్త భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటైన సంగతి భారత దేశ చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన విషయం. వారి అంకితభావం,అకుంఠిత నిరాహార దీక్షా దక్షిత గమనించిన గాంధీ గారు "శ్రీరాములు లాంటి మరో 11మంది నాకు అనుచరులుగా ఉంటే ఒక్క సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ల నుంచి స్వాతంత్ర్యం సాధిస్తాను" అన్నారంటే శ్రీరాములు గారి ఔన్నత్యం ఏమిటో మనకు బోధపడుతుంది.
అటువంటి మహనీయుని జయంతిని ఘనంగా నిర్వహించి వారికి నివాళులర్పించటం మనకెంతో అదృష్టం, గర్వకారణం. అందుకే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహించటం గతం నుండి ఆనవాయితీగా వస్తోంది. ఆ సంప్రదాయాన్ని కొనసాగించకపోతే అది చారిత్రక భ్రష్టత్వం అవుతుంది. జాతి ద్రోహం అవుతుంది. ఆనవాయతీగా వస్తున్న ఆ సత్సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అమరజీవి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా జరిపించవలసిందిగా కోరుతున్నాను.