Telugudesam: సర్వోన్నత సభలో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయరా?: అశోక్ గజపతిరాజు ఆవేదన
- అశాస్త్రీయ విభజనతో రాష్ట్రాన్ని ముక్కలు చేశారు
- తక్కువ తలసరి ఆదాయం గల రాష్ట్రాల్లో ఏపీ ఒకటి
- రాష్ట్ర ప్రయోజనాల కోసమే రాజీనామా
సర్వోన్నత సభలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయరా? అని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన కారణాలను లోక్ సభకు వివరిస్తూ, అశాస్త్రీయ విభజనతో ఏపీ తీవ్ర ఒడిదుడుకులకు లోనైందని అన్నారు. సంస్థలు, మౌలిక సదుపాయాలు, రాజధాని లేకపోగా, రాష్ట్రాన్ని కరువులు, తుపాన్లు పీడించాయని పేర్కొన్నారు. దీంతో దేశంలో అతి తక్కువ తలసరి ఆదాయం గల రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అలాంటి రాష్ట్రానికి దేశంలో ఉన్నత వ్యక్తులుగా పేర్కొన్న వారు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అన్నారు. అంటే ఉన్నత వ్యక్తులు ఇచ్చే హామీలు అమలు కావా? అని ప్రజలు అడుగుతున్నారని ఆయన అన్నారు. దేశానికి కేంద్ర మంత్రి స్థాయిలో సేవ చేసే అవకాశం కొద్ది మందికే లభిస్తుందని చెప్పిన ఆయన పౌర విమాన రంగాన్ని ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంగా తీర్చిదిద్దడంలో తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సహచరులతో సమష్టిగా పనిచేసే అదృష్టం తనకు దక్కిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.