Parliament: కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, టీఎంసీ... నేతలందరినీ కలసి మద్దతు కోరుతున్న వైసీపీ ఎంపీలు!
- మా అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వండి
- వివిధ పార్టీల నేతలకు వైసీపీ విజ్ఞప్తి
- పార్లమెంట్ ను వాయిదా వేసే ఆలోచనలో మోదీ సర్కారు!
కేంద్ర ప్రభుత్వంపై నేడు లోక్ సభలో తాము పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని కోరుతూ వైఎస్ఆర్ సీపీ ఎంపీలు పలు ప్రాంతీయ పార్టీల నాయకులను కలిసి కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే, టీఎంసీ నేత సౌగత్ రాయ్, టీడీపీ నేత తోట నరసింహం, టీఆర్ఎస్ నేత జితేందర్ రెడ్డి, బీజేడీ నేత భర్తృహరి మెహతాబ్, ఎన్సీపీ నేత తారిఖ్ అన్వర్, ఆప్ ఎంపీ భగవంత్ మాన్, సీపీఎం నేత సీతారాం ఏచూరి తదితరులను వైసీపీ ఎంపీలు కలిశారు. నేడు తమతో కలసి రావాలని, అవిశ్వాసానికి మద్దతివ్వాలని కోరారు.
కాగా, లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ జరగాలంటే మొత్తం సభ్యుల్లో పదోవంతు సభ్యుల మద్దతుండాలన్న సంగతి తెలిసిందే. వైసీపీకి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మద్దతు పలికింది. మిగతా పార్టీల మాటెలా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఒక్కటి మద్దతిస్తే, అవిశ్వాసంపై చర్చ జరుగుతుంది. అయితే, ఇదే సమయంలో అవిశ్వాసంపై చర్చ చేపట్టకుండానే పార్లమెంట్ ను నిరవధిక వాయిదా వేసే ఆలోచనలో నరేంద్ర మోదీ సర్కారు ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.