cyber security: దేశ సైబర్ సెక్యూరిటీ చీఫ్ నెట్ బ్యాంకింగ్ కు దూరం... ఎందుకని?
- నెట్ బ్యాంకింగ్ ను తక్కువగా వినియోగిస్తా
- ఎందుకంటే దానివల్ల సమస్యలేంటో నాకు తెలుసు
- ఖాతాలో రూ25,000 లోపు ఉంచే డెబిట్ కార్డు వాడతా
డిజిటల్ లావాదేవీలను పెంచాలని మోదీ సర్కారు ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైబర్ సెక్యూరిటీ విభాగం చీఫ్ గుల్షన్ రాయ్ నెట్ బ్యాంకింగ్ లావాదేవీలకు తాను దూరంగా ఉంటానంటూ చెప్పడం ఆశ్చర్యం కలిగించే అంశం. తాను నెట్ బ్యాంకింగ్ ను అరుదుగా వాడతానని, ఎందుకంటే దానివల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటో తనకు తెలుసునని ఆయన చెప్పారు. తద్వారా ఆన్ లైన్ లావాదేవీల విషయంలో జాగ్రత్తగా మసలుకోవాలని ఆయన పరోక్షంగా చెప్పారు.
‘‘అక్కడ కొన్ని సమస్యలున్నాయి. ఈ కామర్స్ వేదికలపై నియంత్రణ ఎవరిది? వినియోగదారు ఫిర్యాదులను పరిష్కరించేది ఎలా? ఏటీఎంలు, క్రెడిట్ కార్డు మోసాలు చాలా సంక్లిష్టమైనవి. వాటిని పరిష్కరించడం ఒకింత కష్టం’’ అని రాయ్ చెప్పారు.
‘‘నాకు ఒక ప్రత్యేక ఖాతా ఉంది. అందులో కొంచెమే నగదు ఉంచుతాను. డెబిట్ కార్డుతో లావాదేవీలు చేయాలనుకుంటే ఆ ఖాతాలో రూ.25,000 మాత్రమే ఉంచి చేస్తాను. దాంతో జాతీయ వినియోగారుల సంస్థ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు’’ అని ఆయన చెప్పారు. సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని ప్రధానమంత్రి మోదీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసి దానికి తొలి బాస్ గా రాయ్ ను నియమించిన విషయం గమనార్హం.