Chandrababu: ఒకే ఒక్క నిమిషంలో చంద్రబాబు నిర్ణయం మార్చుకున్నారు: ఎంపీ విజయసాయి రెడ్డి
- 9.30 గంటల వరకు చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నారు
- 9.31కి ఎన్డీఏతో విడిపోయారు
- మేము నిన్నే అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చాం
- 9.31కి టీడీపీ నోటీసులు ఇచ్చింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చిత్తశుద్ధి లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ రోజు ఉదయం 9.30 గంటల వరకు ఎన్డీఏలో ఉన్న చంద్రబాబు 9.31గంటలకి ఎన్డీఏతో విడిపోయి, ఒకే ఒక్క నిమిషంలో తన ఆలోచన తీరును మార్చేసుకున్నారని అన్నారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలంటే రాజకీయాలను పక్కనబెట్టి పోరాడాలని, అవిశ్వాస తీర్మానానికి నోటీసులను తాము నిన్నే అందించామని, ఈ రోజు 9.31 గంటలకి టీడీపీ అవిశ్వాస తీర్మానం ఇచ్చిందని అన్నారు. ఒకే ఒక్క నిమిషంలో చంద్రబాబు తన నిర్ణయం మార్చుకున్నారని వ్యాఖ్యానించారు.
పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని, కానీ, టీడీపీ ఆ ఉద్దేశంతో లేదని చంద్రబాబు అన్నారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతుని వైసీపీ కోరిందని, జగన్ ఏది చేసినా చిత్తశుద్ధితో పనిచేస్తారని అన్నారు. చంద్రబాబునాయుడు అవినీతికి పాల్పడుతున్నారని, అందుకే ఆయనకు మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని అన్నారు.
ఒకవేళ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు నాయుడు మాట్లాడాల్సి వస్తే మోదీది వేరే పార్టీ, ఇప్పుడు తాను ఆ పార్టీతో విడిపోయాడు కాబట్టి మాట్లాడబోనని అంటారని వ్యాఖ్యానించారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక నేరగాడు చంద్రబాబు నాయుడు అని ఆయన ఆరోపించారు.