aashirvaad atta: ఆశీర్వాద్ ఆటాలో ప్లాస్టిక్ ఉందంటూ వీడియోల హల్ చల్... ప్లాస్టిక్ కాదు ప్రొటీన్ అని ఐటీసీ స్పష్టీకరణ
- వినియోగదారులు నకిలీ వీడియోలను నమ్మొద్దు
- ప్లాస్టిక్ అని చెబుతున్నది గోధుమలోని గ్లూటెన్ అనే ప్రొటీన్
- వినియోగానికి ఆశీర్వాద్ ఆటా పూర్తి సురక్షితం: ఐటీసీ
ఆశీర్వాద్ ఆటా పిండి గురించి తెలియని వారుండరు. దేశంలోని చాలా ఇళ్లల్లో ఇది దర్శనమిస్తుంది. అయితే ఈ ఆటా పిండిలో ప్లాస్టిక్ ఉందంటూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో దురుద్దేశపూర్వక వీడియాలను పోస్ట్ చేస్తుండడంపై ఐటీసీ సంస్థ సీరియస్ గా స్పందించింది. ఇప్పటికే ఈ విషయమై రెండు ఎఫ్ఐఆర్ లు దాఖలు చేయగా, ఢిల్లీలో మరో ఎఫ్ఐఆర్ దాఖలు చేయనున్నట్టు ఈ రోజు ప్రకటించింది.
హైదరాబాద్, కోల్ కతాలోనూ ఈ వీడియోలపై సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ లు దాఖలయ్యాయి. ఢిల్లీలో మరో ఎఫ్ఐఆర్ దాఖలు చేయనున్నామని ఐటీసీ డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హేమంత్ మాలిక్ మీడియాకు తెలిపారు. హైదరాబాద్, కోల్ కతా లో తమ ఫిర్యాదులపై ఇప్పటికే సైబర్ సెల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
ఆశీర్వాద్ ఆటా వినియోగానికి పూర్తి సురక్షితమని ఆయన స్పష్టం చేశారు. వీడియోల్లో ప్లాస్టిక్ అని చెబుతున్నది గోధుమలోని ప్రొటీన్ గా ఆయన తెలిపారు. ‘‘భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ సైతం గోధుమ పిండిలో ఆరు శాతం గ్లూటెన్ ఉండాలని నిర్దేశించింది. ఇది గోధుమలోని ప్రొటీన్. ఫేక్ వీడియోలను చూసి వినియోగదారులు పొరపడవద్దు’’ అని హేమంత్ మాలిక్ కోరారు.