Chandrababu: ఇంకా మిత్రత్వం కొనసాగిస్తామని ఎలా అనుకుంటారు?: చంద్రబాబు

  • నాలుగు బడ్జెట్‌లలో అన్యాయం చేశారు
  • చివరి బడ్జెట్‌లో కూడా ఏపీకి నిధులు ఇవ్వలేదు
  • ఎందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందో అందరూ ఆలోచించుకోవాలి
  • విభజన హామీలను అమలు చేయాలి

ప్రజలు తమను విశ్వసించి అధికారం అప్పజెప్పారని రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ... నాలుగు బడ్జెట్‌లలో తప్పించుకుని చివరి బడ్జెట్‌లో కూడా ఏపీకి నిధులు ఇవ్వలేదని అన్నారు. చివరి బడ్జెట్‌లోనూ ఏపీకి అన్యాయం చేశారని, తాము ఇంకా ఎన్డీఏతో మిత్రత్వం కొనసాగిస్తామని ఎలా అనుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఈ రాష్ట్రంలో ఉండే ఏ నాయకులు బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని మొదట మాట్లాడలేదని, తాను అన్యాయం జరిగిందని చెప్పిన తరువాతే ఇతర పార్టీల నాయకులు కూడా ఇదే మాట అన్నారని చంద్రబాబు అన్నారు. బీజేపీతో ఎన్డీఏలో ఉండబోమని తాము నిర్ణయం తీసుకున్నామని, ఎందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందో అందరూ ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు. విభజన సమయంలో పార్లమెంటులో ఓ చట్టాన్ని పెట్టారని దాన్ని అమలు చేయమని కోరుతున్నామని, కొన్ని హామీలు కూడా ఇచ్చారని వాటిని కూడా అమలు చేయాలని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం డొంకతిరుగుడు సమాధానాలు చెబుతోందని, పార్లమెంటులో తాము పోరాడుతుంటే ఒక్కసారయినా కూర్చోబెట్టి ప్రధాని మోదీ చర్చించారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. తాము నిన్నటి వరకు వేచి చూశామని, ఇక తాము ఎన్డీఏలో ఎందుకు ఉండాలని ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్న తరువాతే అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయం తీసుకుని అదే విధంగా చేశామని అన్నారు. 

  • Loading...

More Telugu News