Chandrababu: పోలవరంపై పవన్ అవగాహన ఉండే మాట్లాడుతున్నారా?: చంద్రబాబు మండిపాటు
- పోలవరం ప్రాజెక్టులో అడ్డంకులు సృష్టించి అడ్డుకట్టవేసే ప్రయత్నాలు చేస్తున్నారు
- భూసేకరణలో అక్రమాలు జరిగాయని వైసీపీ అంటోంది
- 1500 ఎకరాలు చాలని పవన్ కల్యాణ్ అంటున్నారు
తాము రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తోంటే కొందరు మాత్రం తాము చేస్తోన్న పనులకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన శాసనమండలిలో మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టులో అడ్డంకులు సృష్టించి అడ్డుకట్టవేసే ప్రయత్నాలు చేస్తూ ప్రతిపక్ష పార్టీల నేతలు ఎన్నో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. పోలవరంపై పవన్ కల్యాణ్ కూడా ఆరోపణలు చేస్తున్నారని, అవగాహన ఉండి మాట్లాడుతున్నారా? అవగాహన లేక మాట్లాడుతున్నారా? అని ఆయన ప్రశ్నించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకున్న నిర్ణయాలపై లేనిపోని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. పోలవరం ఏపీ జీవనాడి అని, దాని నిర్మాణం పూర్తి చేస్తే నీటి ఎద్దడి ఉండదని, రాష్ట్రంలో కరవు ఉండదని అన్నారు. అలాగే భూసేకరణ అక్రమాలపై సీబీఐ విచారణ వేయాలని సాక్షి పత్రికలో రాశారని, ఇలా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. రాజధానికి రైతులు 33 వేల ఎకరాల భూమి ఇచ్చారని వివరణ ఇచ్చారు. రాజధానికి 1500 ఎకరాలు చాలని పవన్ కల్యాణ్ అంటున్నారని, అది సరికాదని అన్నారు.