sidharamaiah: దక్షిణాది రాష్ట్రాల డబ్బుల్ని ఉత్తరాది రాష్ట్రాలకు ఇస్తారా?.. మేం అభివృద్ధి చెంది ఏం లాభం?: మండిపడ్డ సిద్ధరామయ్య

  • కేంద్రానికి ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నది దక్షిణాది రాష్ట్రాలే
  • కేంద్రం నుంచి వస్తున్న నిధులు మాత్రం చాలా తక్కువ
  • మేం అభివృద్ధి చెంది ఏం లాభం?
  • ఎక్కువ పన్నులు చెల్లిస్తున్న దక్షిణాదికి.. ఎక్కువ కేంద్ర నిధులు రావాల్సిందే

ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య అగాధం క్రమంగా పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై దక్షిణాది రాష్ట్రాలు మండిపడుతున్నాయి. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా కేంద్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశానికి ఎక్కువ ట్యాక్స్ లు దక్షిణాది రాష్ట్రాల నుంచే వెళుతున్నాయని... ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వస్తున్న నిధులు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు.

ఇప్పటి వరకు ఇలాంటి ఆరోపణలను ప్రాంతీయ పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు మాత్రమే చేశారు. ఒక జాతీయ పార్టీకి (కాంగ్రెస్) చెందిన ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి. ఉత్తరాది రాష్ట్రాలు విఫలమయ్యాయని... వాటిని పోషించడానికి దక్షిణాది రాష్ట్రాల సంపదను వాడుకుంటున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఉత్తరాది రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలే సబ్సిడీలను అందిస్తున్నాయని సిద్ధూ అన్నారు. దక్షిణాదికి చెందిన 6 రాష్ట్రాలు దేశానికి ఎక్కువ పన్నులు కడుతున్నాయని... కానీ, కేంద్రం నుంచి తిరిగి వస్తున్న నిధులు మాత్రం చాలా స్వల్పంగా ఉన్నాయని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ నుంచి కేంద్రం వసూలు చేస్తున్న ప్రతి ఒక్క రూపాయి పన్నుకు... కేంద్ర ప్రభుత్వ నిధుల రూపంలో రూ. 1.79లు తిరిగి అందతున్నాయని చెప్పారు. ఇదే సమయంలో కర్ణాటకు కేవలం 47 పైసల కేంద్ర నిధులు మాత్రమే అందుతున్నాయని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు గొప్పగా అభివృద్ధి చెంది, దేశానికి భారీ సంపదను అందిస్తున్నాయని... అలాంటి దక్షిణాది రాష్ట్రాలకు తిరిగి దక్కే ప్రతిఫలం ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు.

కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంద్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు సెంట్రల్ ట్యాక్స్ రూపంలో చెల్లించే మొత్తంతో పోల్చితే... కేంద్రం నుంచి తిరిగి వస్తున్న నిధులు అతి తక్కువ అని సిద్ధరామయ్య చెప్పారు. కేంద్ర పథకాలు మాత్రం దేశ వ్యాప్తంగా ఒకేలా ఉంటాయని... వాటిని అమలు చేయడానికి కూడా కేంద్రాన్ని తాము అడుక్కోవాలని మండిపడ్డారు. తమ రాష్ట్రాల నుంచి వెళ్తున్న పన్నుల్లో సింహ భాగం మళ్లీ తమ రాష్ట్రాలకే రావాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర పథకాలను మార్చుకునే వెసులుబాటు కూడా దక్షిణాది రాష్ట్రాలకు ఉండాలని... దీంతో, తమ అవసరాలకు తగ్గట్టుగా పథకాలను తాము డిజైన్ చేసుకుంటామని చెప్పారు.

సిద్ధరామయ్య అభిప్రాయాలను ఇప్పటికే ఏపీ, టీఎస్ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లేవనెత్తారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితతో పాటు పలువురు తమిళ నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని చెప్పారు.

  • Loading...

More Telugu News