guntur: అతిసార బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : ఏపీ మంత్రులు
- బాధితులకు చికిత్స అందిస్తున్నాం
- ఈ సంఘటనకు బాధ్యులను సస్పెండ్ చేశాం
- మృతుల కుటుంబాలకు చంద్రన్న బీమా, ఎక్స్ గ్రేషియా ఇచ్చాం
- పవన్ కల్యాణ్ దీక్షకు కూర్చునే అవకాశమివ్వం : ఏపీ మంత్రులు
గుంటూరులో అతిసార వ్యాధి బారిన పడ్డ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి హామీ ఇచ్చారు. ఏపీ శాసనసభ ప్రాంగణలోని మీడియా పాయింట్ వద్ద ఈరోజు వారు మాట్లాడారు. గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద ట్యాంకులో నిల్వ ఉన్న నీరు కలుషితం కావడం వల్ల ఆ ప్రాంతంలోని వారు అతిసార (డయేరియా) బారినపడ్డారని అన్నారు.
ఈ విషయం తెలిసిన వెంటనే ఇంటింటికి తిరిగి బాధితులను గుర్తించి ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఆ ప్రాంతాల్లో పది మెడికల్ క్యాంపులు, పది అంబులెన్స్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం అతిసార బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రిలో పాటు కార్పోరేట్ ఆస్పత్రుల్లో కూడా చికిత్స చేయిస్తున్నామని, ఆ ఖర్చు ప్రభుత్వమే భరిస్తున్నట్లు చెప్పారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యుల సూచనల మేరకు అతిసార బాధితులకు కార్పోరేట్ ఆస్పత్రులలో చికిత్స చేయిస్తున్నామని, ప్రస్తుతం, ముగ్గురు బాధితులు కార్పోరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు పరిస్థితిని సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారని అన్నారు.
బాధ్యులను సస్పెండ్ చేశాం..వారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు చర్యలు
నీరు కలుషితమవడానికి బాధ్యులైన శానిటేషన్, ఇంజనీరింగ్ సిబ్బంది ఎనిమిది మందిని సస్పెండ్ చేసినట్లు వారు తెలిపారు. ఈ సంఘటనలో ఇంకా బాధ్యులెవరైనా ఉన్నట్టు తెలిస్తే వారిపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకూ తగు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.మొత్తం 130 మంది అతిసార బాధితులు ఆసుపత్రిలో చేరారని, ఆ సంఖ్య ఈరోజుకు 82కు తగ్గిందని అన్నారు. ఈ సంఘటనలో మృతి చెందిన వారు ఎంత మందో నిర్ణయించేందుకు ఓ కమిటీ వేశామని, ఎనిమిది మంది మృతి చెందినట్టు ప్రస్తుతానికి ఆ కమిటీ నిర్ధారించిందని అన్నారు.
మృతుల కుటుంబసభ్యులకు చంద్రన్న బీమాతో పాటు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చినట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబీకుల వద్దకు వెళ్లి సంబంధిత చెక్కులను వారికి అందజేశామని, ఇంకా ఎవరైనా మరణించినట్లు ఆ కమిటి నిర్ధారిస్తే వారికి కూడా ఎక్స్ గ్రేషియా అందజేస్తామని చెప్పారు. ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించామని, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మునిసిపల్, ఇంజనీరింగ్, వైద్య ఆరోగ్య శాఖల సిబ్బంది రక్షిత మంచినీరు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
అతిసార వ్యాపించిన ప్రాంతాలకు ట్యాంకుల ద్వారా మంచినీటి సరఫరా
అతిసార వ్యాపించిన ప్రాంతాలకు 75 ట్యాంకుల ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నట్లు మంత్రులు చెప్పారు. ట్యాంక్ లను సూపర్ క్యూరినేషన్ చేయించామని, ఇంటింటికి తిరిగి నీరు ఎలా వస్తుందో తెలుసుకున్నామని, మంచి నీరు వస్తున్నట్లు స్థానికులు చెప్పారని అన్నారు. గుంటూరులో 40 ఏళ్ల క్రితం అమర్చిన మంచినీటి సరఫరా పైప్ లైన్లు మార్చే నిమిత్తం గత ఫిబ్రవరి 20న టెండర్లు పిలిచిన విషయాన్ని వారు ప్రస్తావించారు. ఈ సంఘటనను రాజకీయం చేయాలని కొందరు నాయకులు చూస్తున్నారని, అది కరెక్టు కాదని అన్నారు.
పవన్ కల్యాణ్ విమర్శలను స్వాగతిస్తున్నామని, దీక్షకు కూర్చునే అవకాశం ఆయనకు ఇవ్వమని, 48 గంటల లోపలే అన్ని అంశాలు పరిష్కరిస్తామని చెప్పారు. గుంటూరును ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దుతామని, ఇప్పటికే గుంటూరు అభివృద్ధికి రూ.2 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.