Bollywood: సల్మాన్ ఖాన్ తన భర్త అంటూ ఓ యువతి హంగామా!
- సల్మాన్ నివసించే గెలాక్సీ అపార్ట్ మెంట్ లో సంఘటన
- సెక్యూరిటీ కళ్లు గప్పి లోపలికి వెళ్లిన ఓ వీరాభిమాని
- చేతిలో ఇనుపరాడ్లు.. దగ్గరకు వస్తే చనిపోతానన్న వైనం
- సముదాయించి ఆమెను కిందకు దించిన అగ్నిమాపక సిబ్బంది
బాలీవుడ్ కండల వీరుడు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సల్మాన్ ఖాన్ తన భర్త అంటూ ఓ వీరాభిమాని హల్ చల్ చేసింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో సల్మాన్ నివసించే గెలాక్సీ అపార్ట్ మెంట్ లో ఇటీవల ఈ సంఘటన జరిగింది. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది కంటపడకుండా అపార్ట్ మెంట్ పైభాగానికి ఆ యువతి చేరుకుంది. సల్మాన్ తన భర్త అంటూ కేకలు వేయడంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, వెంటనే అక్కడికి చేరుకున్నారు.
అయితే, ఆ యువతి చేతిలో ఇనుపరాడ్లు ఉండటంతో, ఆమె దగ్గరకు వెళ్లేందుకు వారు సాహసించలేదు. పైగా తన దగ్గరకు వస్తే చనిపోతానంటూ బెదిరించింది. దీంతో, అగ్నిమాపక సిబ్బందికి సెక్యూరిటీ సిబ్బంది సమాచారమివ్వడంతో వారు అక్కడికి వెళ్లారు. ఆ యువతికి నచ్చజెప్పి ఎట్టకేలకు కిందకు దించారు. కాగా, ఇంత జరుగుతున్నప్పటికీ ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. సల్మాన్ నటిస్తున్న ‘రేస్ 3’ చిత్రం ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ అబుదాబిలో జరుగుతోంది. షూటింగ్ నిమిత్తం సల్మాన్ అబుదాబిలో ఉన్నాడు.