Bangladesh: శ్రీలంకపై బంగ్లాదేశ్ సంచలన విజయం.. భారత్-బంగ్లా మధ్య రేపు టైటిల్ పోరు
- తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రెచ్చిపోయిన బంగ్లాదేశ్
- సొంత గడ్డపై శ్రీలంకకు పరాభవం
- బంగ్లాను గెలిపించిన మహ్మదుల్లాకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
ఫైనల్‌కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ సత్తా చాటింది. నిదహాస్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. రేపు జరగనున్న ఫైనల్లో భారత్-బంగ్లాదేశ్ తలపడనున్నాయి.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్ల దెబ్బకు ఒకదశలో 41 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి లంక విలవిల్లాడింది. అయితే కెప్టెన్ థిసార పెరీరా, కీపర్ కుశాల్ పెరీరాలు రెచ్చిపోవడంతో లంక గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. మొత్తం 37 బంతులు ఎదుర్కొన్న పెరీరా 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. కుశాల్ పెరీరా 40 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 61 పరుగులు చేశాడు. మిగతా వారిలో మరెవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. దీంతో 20 ఓవర్లకు శ్రీలంక ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
అనంతరం 160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ వీరోచిత పోరాటంతో మరో బంతి మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఒకదశలో బంగ్లాదేశ్ ఓటమి ఖాయమని తేలిపోయింది. అయితే మహ్మదుల్లా అద్భుత పోరాటంతో బంగ్లాదేశ్ అపురూప విజయాన్ని అందుకుని ఫైనల్లోకి ప్రవేశించింది. తమీమ్ ఇక్బాల్ 50, ముష్ఫికర్ రహీం 28 పరుగులు చేశారు. చివర్లో మహ్మదుల్లా వీరవిహారం చేసి జట్టును గెలిపించాడు. కేవలం 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసి మరో బంతి మిగిలి ఉండగానే జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
బంగ్లాదేశ్ గెలుపుతో జట్టులో ఆనందాలు మిన్నంటాయి. ఆటగాళ్లు మైదానంలోకి దూసుకొచ్చి డ్యాన్స్‌లు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. కెప్టెన్ షకీబుల్ చొక్కా విప్పేసి గంతులేశాడు. అనూహ్యంగా ఓడిపోయిన శ్రీలంక ఆటగాళ్లు నిరాశలో కూరుకుపోయారు. జట్టును ముందుండి గెలిపించిన మహ్మదుల్లాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.