Hyderabad Central University: హైదరాబాద్ యూనివర్శిటీలో కలకలం...విద్యార్థినిపై నలుగురు యువకుల అత్యాచారయత్నం
- హైదరాబాద్ యూనివర్శిటీ విద్యార్థినిపై నలుగురు యువకుల అత్యాచారయత్నం
- పోలీసుల అదుపులో ఒకరు...పరారీలో మరో ముగ్గురు
- నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని యూనివర్శిటీ విద్యార్థినుల డిమాండ్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో శుక్రవారం రాత్రి పదిగంటలు దాటిన తర్వాత నలుగురు యువకులు ఓ విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకర్ని అదుపులోకి తీసుకున్నామని వారు చెప్పారు. క్యాంపస్ ఆవరణలోనే ఈ సంఘటన చోటు చేసుకుందని వారు తెలిపారు. బాధితురాలు కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారని వారు పేర్కొన్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
మరోవైపు ఈ ఘటనను యూనివర్శిటీ విద్యార్థినులు తీవ్రంగా పరిగణిస్తూ దీనిపై యాజమాన్యం తగు విధంగా స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, బాధిత విద్యార్థిని ఓ వ్యక్తితో కలిసి మాట్లాడుతున్నప్పుడు నలుగురు యువకులు అక్కడికి వచ్చారని, వారు అతడ్ని బెదిరించి, ఆమెపై అఘాయిత్యానికి పూనుకున్నారని, ఆమె కేకలు వేయడంతో వారు భయపడి అక్కడి నుంచి పారిపోయారనే వార్త కూడా వినబడుతోంది. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణ తర్వాతే అసలు నిజం బయటకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.