Mahmudullah: క్రీడాస్ఫూర్తి మంటగలిసిన వేళ... బంగ్లా టీమ్ డ్రెస్సింగ్ రూమ్ లో అద్దాలు పగులగొట్టిన వైనం!
- లంకలో బంగ్లాదేశ్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్ అద్దం ధ్వంసం
- వీడియో ఫుటేజీ సాయంతో నిందితులపై చర్యకు సిఫారసు చేయనున్న మ్యాచ్ రిఫరీ బ్రాడ్
- బంగ్లా ప్లేయర్ల వ్యవహారశైలిపై సర్వత్ర విమర్శలు
- నష్టపరిహారం చెల్లిస్తామని బంగ్లా టీమ్ యాజమాన్యం ఆఫర్
క్రికెట్‌కు 'జెంటిల్‌మన్ గేమ్' అనే పేరుంది. అలాంటి జెంటిల్‌మన్ గేమ్‌కు శ్రీలంకలో జరుగుతున్న నిదాహాస్ టీ-20 ముక్కోణపు టోర్నీ సందర్భంగా తీరని మచ్చ వాటిల్లింది. క్రీడాస్ఫూర్తి మంటగలిసిపోయింది. ఆతిథ్య శ్రీలంక-బంగ్లాదేశ్ జట్ల మధ్య నిన్నటి కీలక మ్యాచ్ ఆద్యంతం ఆసక్తికరంగా జరిగింది. మైదానంలో ఇరు జట్ల ప్లేయర్ల మధ్య కొన్ని ఆక్షేపణీయ దృశ్యాలు గోచరించాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ జట్టు సభ్యుల తీరు అభ్యంతరకంగా, విమర్శనాత్మకంగా మారింది. నిన్నటి కీలక మ్యాచ్‌లో బంగ్లా ప్లేయర్ మహ్మదుల్లా 18 బంతుల్లో 43 పరుగులు చేయడంతో ఆ జట్టు భారత్‌తో రేపు జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధించింది.
అయితే పలువురు బంగ్లా టీమ్ ప్లేయర్లు తమ డ్రెస్సింగ్ రూమ్ ముందు భాగంలో అద్దాల ముక్కలు పడిఉన్న మెట్లపై వేగంగా నడుచుకుంటూ వెళ్లడం నిఘా నేత్రంలో రికార్డయింది. అసలు ఆ డ్రెస్సింగ్ రూమ్ ముందు భాగంలోని అద్దాన్ని ఎవరు బద్దలు కొట్టారన్న దానిపై మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ ఇప్పుడు దృష్టి సారించారు. ముందుగా అక్కడి కేటరింగ్ సిబ్బంది నుంచి ఆయన వివరాలను తీసుకున్నారు. ఈ దుందుడుకు చర్యకు కారకులెవరో వారు ఆయనకు చెప్పినట్లు తెలిసింది. కానీ, వారి వాంగ్మూలంతో సరిపెట్టుకోకుండా సంబంధిత వీడియో తాలూకూ ఫుటేజీని బ్రాడ్ తెప్పించుకుని పరిశీలిస్తున్నారట. దాని ఆధారంగా నిందిత ప్లేయర్లపై చర్యలకు ఆయన సిఫారసు చేసే అవకాశమున్నట్లు ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో తెలిపింది. అద్దాల ధ్వంసం విషయం తెలుసుకున్న బంగ్లాదేశ్ టీమ్ యాజమాన్యం అందుకు నష్ట పరిహారాన్ని చెల్లిస్తామని చెప్పినట్లు సమాచారం.