Ganta Srinivasa Rao: ఈ ఏడాదైనా ఏపీలో సెంట్రల్, గిరిజన వర్సిటీలను నెలకొల్పండి: మంత్రి గంటా శ్రీనివాసరావు
- కేంద్ర ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి సుబ్రమణ్యంను కలిసిన మంత్రి గంటా
- కేంద్ర విద్యాసంస్థలకు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి
- తాత్కాలిక ప్రాంగణంలో సెంట్రల్, గిరిజన వర్సిటీలను ప్రారంభిస్తామని హామీ
విభజన చట్టంలోని హామీలైన సెంట్రల్ యూనివర్సిటీ, గిరిజన వర్సిటీలను కనీసం ఈ విద్యాసంవత్సరంలోనైనా నెలకొల్పే దిశగా చర్యలు తీసుకోవాలని ఏపీ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు.. కేంద్ర ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రమణ్యంను కోరారు. ఈ రోజు న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి గంటా.. కేంద్ర ఉన్నత విద్యా కార్యదర్శి రెడ్డి సుబ్రమణ్యం, ఇతర ఉన్నతాధికారులను కలిశారు. విభజన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపైన ఉందని అన్నారు.
దీనిపై రెడ్డి సుబ్రమణ్యం స్పందిస్తూ... తాత్కాలిక ప్రాంగణంలో వర్సిటీలను ప్రారంభిద్దామని, ఆ మేరకు టెంపరరీ అకామిడేషన్ ప్రతిపాదనలు సిద్ధం చేసి తమకు పంపాలని సూచించారు. అదే విధంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఐదు కేంద్ర ఉన్నత విద్యాసంస్థలకు నిధులు సరైన రీతిలో అందడం లేదని, వీటికి నిధులు వెనువెంటనే ఇవ్వాలని మంత్రి గంటా కోరారు. ఐఎఫ్ఐ ద్వారా నిధులు అందించేలా చర్యలు చేపడతామని మంత్రి గంటాకు.. రెడ్డి సుబ్రమణ్యం తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి గంటాతో పాటు బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు కూడా పాల్గొన్నారు.