Pawan Kalyan: ఎవరితోనూ పొత్తుండదు!: స్పష్టం చేసిన పవన్ కల్యాణ్
- ఒంటరిగానే జనసేన పోరు
- అన్ని విమర్శల గురించీ చంద్రబాబుకు ముందే చెప్పా
- హోదాపై త్వరలోనే పోరాట కార్యాచరణ
2019లో జరిగే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులుండబోవని, ఒంటరిగానే పోరాటం ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై నాలుగేళ్ల క్రితమే మోదీతో మాట్లాడానని, తెలుగుదేశం పార్టీ గురించి తాను చేసిన అన్ని విమర్శల గురించి గతంలోనే చంద్రబాబుతో చర్చించానని అన్నారు. హోదా ఇవ్వకుంటే ఆంధ్రప్రదేశ్ లో మనుగడ కష్టమని ప్రధానికి తెలుసునని అన్నారు. వామపక్షాలతో తనకు తొలినుంచే అవగాహన ఉందని చెప్పిన పవన్, మరే ఇతర పార్టీలతోనూ పొత్తులకు అవకాశాలు లేవని అన్నారు. హోదా కోసం జరిగే పోరాట కార్యాచరణను అతి త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు.
గతంలో తాను ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరాలు పెరుగుతున్నాయని చెప్పినప్పుడు చాలా మంది వ్యతిరేకించారని, ఇప్పుడు దక్షిణాది సీఎంలంతా తన మాటలను అంగీకరిస్తున్నారని, దక్షిణాదిపై ఉత్తరాది పెత్తనం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోందని తెలిపారు. ఫాతిమా కాలేజీ విద్యార్థుల సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయలేకపోయిందని పవన్ ఆరోపించారు. రాజధాని నిర్మాణం గురించి తాను చంద్రబాబుతో మాట్లాడిన వేళ, మంగళగిరి వద్ద ఉన్న అటవీ భూములను డీ నోటిఫై చేయించి నగర నిర్మాణం చేస్తానని చెప్పారని, కానీ అందుకు విరుద్ధంగా 33 వేల ఎకరాలు సమీకరించారని విమర్శించారు.
టీడీపీ పాలనలో అవినీతి పెరిగిపోయిందని, భవిష్యత్తులో కళింగాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రాంతీయవాదం పెరుగుతుందన్న ఆందోళన తనలో ఉందని తెలిపారు. తనకు జగన్ అంటే అభిమానం ఉందని, అయితే, రాజకీయాల్లో వ్యక్తిగత అభిప్రాయాలకు తావుండదని, ఎన్నికల్లో జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తానని అన్నారు.