Jagan: జరగబోయేది ఏంటంటే... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాంగ శ్రవణం విశేషాలివి!
- కాకుమానులో ప్రజల మధ్య జగన్ ఉగాది పర్వదినం
- పంచాగ శ్రవణంలో పాల్గొన్న జగన్
- జరగబోయే అంశాలపై వివరించిన పండితులు
తన ప్రజా సంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఈ ఉదయం ఉగాది పర్వదినాన్ని కాకుమాను గ్రామంలో ప్రజల మధ్య వైభవంగా జరుపుకున్నారు. ప్రత్యేక పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా పండితులు ఈ ఏటి విశేషాలను, భవిష్యత్తులో జరగబోయే అంశాలనూ వెల్లడించారు. వర్షాలు తక్కువగా కురుస్తాయని, దిగుబడి కూడా అంతంతమాత్రంగానే ఉంటుందని తెలిపారు.
రాష్ట్రంలోని దక్షిణాది ప్రాంతాన్ని వరదలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని అన్నారు. నాయకుల మధ్య సమన్వయం లోపిస్తుందని, పాలకులు స్వలాభం మాత్రమే చూసుకుంటారని తెలిపారు. ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదని, పనులు నత్తనడకన సాగుతాయని అంచనా వేశారు. సినిమా రంగం బాగుంటుందని, దేశ రక్షణ రంగం సమర్థవంతంగా పని చేస్తుందని తెలిపారు.
ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందవని, ఆగ్నేయ రాష్ట్రాల్లో అభివృద్ధి పెరుగుతుందని, చిన్న తరహా పరిశ్రమలకు మంచి అవకాశాలు లభిస్తాయని, బంగారం ధరలు దిగివస్తాయని పంచాంగ కర్తలు వెల్లడించారు. విదేశీ మారక విలువలు పెరుగుతాయని, పాల ఉత్పత్తి పెరుగుతుందని, తెల్లని వస్తువులైన ముత్యాలు తదితరాల ధరలు తగ్గుతాయని అంచనా వేశారు. ఈ సంవత్సరం పడే వర్షంలో అధికభాగం సముద్రానికే పరిమితమవుతుందని వెల్లడించారు. పంచాంగ శ్రవణం సందర్భంగా వేద పండితులు జగన్ కు ఆశీర్వచనం పలికారు. ఈ కార్యక్రమంలో వైకాపా కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.