Packaged drinking water: అలెర్ట్...ప్యాకేజ్డ్ తాగునీరు సురక్షితం కాదంటూ నిపుణుల వార్నింగ్..!
- ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌లో సూక్ష్మాతి సూక్ష్మమైన ప్లాస్టిక్ రేణువులు
- కర్బన అవశేషాలున్నాయని ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లపై కొన్ని దేశాల్లో సంపూర్ణ నిషేధం
- భారత్, చైనా, ఇండోనేసియా, అమెరికా తదితర దేశాలలోని బ్రాండెడ్ కంపెనీల వాటర్ బాటిళ్లపై అధ్యయనం
తాగునీరు కలుషితమవుతుండటంతో ఈ మధ్యకాలంలో ప్యాకేజ్డ్ తాగునీటినే మనం ఎక్కువగా ఆశ్రయిస్తున్నాం. అయితే బాటిల్ నీరు కూడా మంచిది కాదని, అందులో సూక్ష్మాతి సూక్ష్మమైన ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయని నిపుణులు తాజాగా హెచ్చరిస్తున్నారు. స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్ ఈ అధ్యయనాన్ని చేపట్టింది. తొమ్మిది దేశాలకు చెందిన సుమారు 249 ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను ఈ అధ్యయనానికి ఉపయోగించారు. ఈ అధ్యయనం ప్రకారం, 90 శాతం వాటర్ బాటిళ్లలో ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయి. భారత్, చైనా, ఇండోనేసియా, కెన్యా, లెబనాన్, మెక్సికో, థాయ్‌లాండ్, అమెరికాల్లోని అత్యుత్తమ బ్రాండ్లకు చెందిన ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్లను పరిశోధకులు పరీక్షించి, నీటి నాణ్యతను విశ్లేషించారు.
లీటరు నీటిలో పది సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు ఉండటాన్ని వారు గుర్తించారు. ఇలాంటి ప్లాస్టిక్ రేణువులున్న నీటిని తాగితే శరీర వాపు, విరేచనాలు, థైరాయిడ్ సమస్యలు లాంటివి తలెత్తుతాయని అపోలో హాస్పిటల్స్‌లో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌గా పనిచేసే డాక్టర్ నవీన్ పోలవరపు చెప్పారు. ఇలాంటి నీరు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చాలా ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ఈ నీటిని గర్భిణులు తాగితే వారికి తక్కువ బరువున్న శిశువులు పుడుతారని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు బాటిళ్లలోని నీటిలో కర్బన అవశేషాలు ఉండటం వల్ల కొన్ని దేశాలు వీటిని పూర్తిగా నిషేధించడం గమనార్హం.
మరోవైపు జీర్ణవ్యవస్థపై కూడా ఈ నీరు ప్రభావం చూపుతుందని మరో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ వినయ్ గుప్తా చెప్పారు. ప్యాక్ చేసిన తాగునీటిలో ప్లాస్టిక్ రేణువులు ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై పూర్తిస్థాయిలో సమీక్ష చేసే విధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) రంగంలోకి దిగే పరిస్థితి ఏర్పడింది. కాగా, 2016లో ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ల ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, పానీయాలు విక్రయమయ్యాయి.