adhar: ఆన్లైన్లో ఆధార్‌ను పొందవచ్చంటూ వస్తోన్న వార్తలను నమ్మొద్దు: ఉడాయ్
- మేరా ఆధార్, మేరీ పెహచాన్ అని ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే పీడీఎఫ్ రూపంలో పొందొచ్చని వార్తలు
- అందులో నిజం లేదని తేల్చి చెప్పిన ఉడాయ్
- వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్ ద్వారా వెల్లడించాలనుకుంటే జరభద్రం
అన్నింటికీ ఆధార్ తప్పనిసరి అవుతోన్న నేపథ్యంలో డూప్లికేట్ ఆధార్ కోసం ఇంటర్నెట్ను ఆశ్రయించే వారు పెరిగిపోతున్నారు. అయితే, మేరా ఆధార్, మేరీ పెహచాన్ అని ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే పీడీఎఫ్ రూపంలో ఆధార్‌ను పొందవచ్చంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) స్పందించి, ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది.
అలాగే, ఆధార్ నెంబర్, ఇతర వ్యక్తిగత సమాచారం ఆన్లైన్ ద్వారా ఇతరులకు వెల్లడించే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించింది. ఇంతవరకు తమ డేటాబేస్ నుంచి ఒక్కరి ఆధార్ కార్డు వివరాలు కూడా బయటకు వెళ్లలేదని కూడా వివరణ ఇచ్చింది. ఎవరైనా అనధికారికంగా ఆధార్ కార్డుదారుల సమాచారాన్ని ఇంటర్నెట్లో పెడితే కేసులు నమోదు చేయాల్సి వస్తుందని తెలిపింది.