First Information Report: రామజన్మభూమిలో మసీదు లేనేలేదు... ద్వారకా పీఠం శంకరాచార్య వివాదాస్పద వ్యాఖ్యలు
- 1992లో కరసేవకులు రామజన్మభూమి వద్ద ఆలయాన్ని ధ్వంసం చేశారని వెల్లడి
- మసీదును ధ్వంసం చేయలేదని స్పష్టీకరణ
- దేశానికి నిజమైన సవాలు అవినీతి అని మండిపాటు
అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమిలో మసీదు అనేది లేనేలేదని ద్వారకా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1992లో మితవాదులు అక్కడ ధ్వంసం చేసింది ఓ దేవాలయాన్ని అని ఆయన స్పష్టం చేశారు. "అయోధ్యలోని రామజన్మభూమిలో అసలు మసీదు లేనే లేదు" అని రామమందిరం-బాబ్రీ మసీదు వివాదంపై ఆయన విలేకరులతో అన్నారు. కరసేవకులు ధ్వంసం చేసింది ఓ దేవాలయాన్నే గానీ మసీదును కాదని ఆయన చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయగానే వివాదాస్పద రామజన్మభూమి ప్రాంతంలో కొత్తగా భారీ రామమందిరాన్ని నిర్మిస్తామని ఆయన చెప్పారు.
ఈ వివాదంపై సుప్రీంకోర్టులో ప్రస్తుతం వాదోపవాదనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు అవినీతిపై కూడా ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశానికి నిజమైన సవాలు అవినీతేనని ఆయన మండిపడ్డారు. గ్రామ పంచాయతీ సభ్యుల స్థాయి మొదలుకుని రాజకీయ నేతలు ఎన్నికల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తుండటాన్ని ఆయన తప్పుబట్టారు. చివరికి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నా కూడా పోలీసులకు లంచం ఇవ్వాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.