Telugudesam: టీడీపీ అవిశ్వాసానికి మద్దతుపై నిర్ణయం తీసుకుంటాం: బీజేడీ
- ఇప్పటికైతే నిర్ణయం తీసుకోలేదు
- రాష్ట్రంలో రాష్ట్రపతి పర్యటిస్తున్నారు
- పర్యటన ముగిసిన తర్వాత సీఎం నిర్ణయం తీసుకుంటారు
- బీజేడీ ఎంపీ పేకే దేవ్
కేంద్రంలోని మోదీ సర్కారుపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలకాలా, వద్దా? అన్న విషయమై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ఒడిశాలోని అధికార పార్టీ బిజూ జనతాదళ్ (బీజేడీ) స్పష్టం చేసింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు పీకే దేవ్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తమ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని, రాష్ట్రపతి పర్యటన ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ విషయమై ఓ నిర్ణయం తీసుకుంటారని దేవ్ వెల్లడించారు.
బిజూ జనతాదళ్ కు లోక్ సభలో 20 మంది ఎంపీల బలగం ఉంది. రాజ్యసభలోనూ ఈ పార్టీకి ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం లోక్ సభలో 539 మంది సభ్యులు ఉండగా, బీజేపీకి మెజారిటీ మార్కు 270 కంటే కాస్తంత ఎక్కువే 274 మంది సభ్యులు ఉన్నారు.