Telugudesam: ప్రభుత్వానికి మద్దతు పలకడం లేదు... ప్రతిపక్షానికీ మద్దతివ్వడం లేదు: శివసేన
- శివసేన ఎంపీ అరవింద్ సావంత్ ప్రకటన
- టీడీపీ బయటకు రావడాన్ని స్వాగతించింది తొలుత శివసేనే
- ఇన్నాళ్లూ కేంద్రాన్ని విమర్శిస్తూ అవిశ్వాసానికి దూరమనడంలో అర్థం ఏముందో?
టీడీపీ కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం విషయంలో శివసేన ఎంపీ అరవింద్ సావంత్ ఆశ్చర్యపరిచే ప్రకటన చేశారు. ఇన్నాళ్లూ మోదీ సర్కారును తెగ విమర్శిస్తున్న శివసేన గతంలోనే ఎన్డీయే నుంచి బయటకు రావడం, బీజేపీతో మిత్రత్వానికి ముగింపు పలకడం తెలిసిందే. కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా లభించిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఆ పార్టీ విమర్శలు చేస్తూ వస్తోంది.
అయితే, ఈ రోజు ఆ పార్టీ ఎంపీ అరవింద్ సావంత్ ఇందుకు భిన్నమైన ప్రకటన చేశారు. టీడీపీ ప్రతిపాదిస్తున్న అవిశ్వాస తీర్మానంపై ఏఎన్ఐ వార్తా సంస్థ స్పందన కోరగా, ‘‘మేం ప్రభుత్వానికి మద్దతు పలకడం లేదు. అలాగని విపక్షానికీ మద్దతు ఇవ్వడం లేదు. మేం దూరంగా ఉంటాం’’ అంటూ ఆయన ప్రకటన చేశారు. టీడీపీ అవిశ్వాసంపై బీజేడీ, టీఆర్ఎస్ సహా కొన్ని పార్టీలు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్న విషయం తెలిసిందే. అయితే, శివసేన నిర్ణయం వెనుక ఏమున్నదీ రానున్న రోజుల్లో తేలిపోనుంది.