Telugudesam: మేము ఇచ్చిన అవిశ్వాస నోటీసును స్పీకర్ రద్దు చేశారు: టీడీపీ ఎంపీలు
- లోక్‌సభ రేపటికి వాయిదా
- మండిపడ్డ టీడీపీ ఎంపీలు
- సభ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోలేదని వ్యాఖ్య
- రాజకీయ ఎత్తుగడతోనే ఇలా చేశారని మండిపాటు
లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఈ రోజు కూడా సాధ్యం కాలేదు. తమ రాష్ట్రాల సమస్యలపై అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసనలు చేపట్టడంతో సభ సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించట్లేదంటూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను రేపటికి వాయిదా వేశారు. అనంతరం పార్లమెంటు వెలుపల టీడీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము ఇచ్చిన అవిశ్వాస నోటీసును స్పీకర్ రద్దు చేశారని ఎంపీ తోట నర్సింహులు అన్నారు. సభ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకున్నట్లు కనపడలేదని, రాజకీయ ఎత్తుగడతోనే ఇలా చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే ఆందోళన చేసే ఎంపీలను విరమింపజేయలేదా? అని ఆయన ప్రశ్నించారు.
ఎంపీ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంటులో చర్చ చేపట్టాలని అన్నారు. కేంద్ర సర్కారు భయపడే అవిశ్వాస తీర్మానంపై చర్చించకుండా ఇలా చేస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తాము ప్రతిరోజు ఇలాగే తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.