Uttar Pradesh: నేను రాష్ట్రపతి మేనల్లుడ్ని అంటూ విజిటింగ్ కార్డులతో వ్యక్తి హల్ చల్!
- హోదాను తెలిపేందుకు విజిటింగ్ కార్డుల వినియోగం
- చిత్రంగా విజిటింగ్ కార్డులు కొట్టించుకున్న పంకజ్ కోవింద్
- రాష్ట్రపతి మేనల్లుడినని విజిటింగ్ కార్డులో పరిచయం
సాధారణంగా ఒక వ్యక్తి హోదాను సూచించేందుకు విజిటింగ్ కార్డులను వినియోగిస్తారు. కానీ ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక వ్యక్తి మాత్రం బంధాన్ని తెలిపేందుకు విజిటింగ్ కార్డును ప్రింట్ చేయించుకుని పంచడం విశేషం. నేను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మేనల్లుడిని అంటూ విజిటింగ్ కార్డులు కొట్టి మరీ ఒక వ్యక్తి ప్రచారం చేసుకుంటున్న ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
దాని వివరాల్లోకి వెళ్తే... యూపీలోని కాన్పూర్ కి చెందిన పంకజ్ కోవింద్ అనే వ్యక్తి తన విజిటింగ్ కార్డులో తాను రామ్ నాథ్ కోవింద్ మేనల్లుడినని పేర్కొన్నాడు. ఈ విజిటింగ్ కార్డును ఒక జర్నలిస్టు తన సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది రాష్ట్రపతి భవన్ కు చేరింది. దీంతో దీనిపై రాష్ట్రపతి ప్రెస్ సెక్రటరీ అశోక్ మాలిక్ స్పందిస్తూ, ‘ఆయన రాష్ట్రపతి మేనల్లుడు కాదని స్పష్టం చేశారు. అసలు ఆయన ఎవరో కూడా రాష్ట్రపతికి తెలియదని ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ అధికారులు అతనిపై కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు’.
దీనిపై నువ్వు నిజంగా రాష్ట్రపతి మేనల్లుడివేనా? అంటూ ఫోన్ చేసిన వారందరికీ ‘తాను రాష్ట్రపతి బంధువునని… ఇందులో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంద’ని పంకజ్ పేర్కొంటున్నాడు.