Undavalli: ఇప్పుడు రాజమండ్రి చిన్నదై పోయింది.. ఉండవల్లి పెద్దదైపోయింది : ఉండవల్లి అరుణ్ కుమార్
- మా పూర్వీకులు 16వ శతాబ్దం నుంచి ఉండవల్లి లోనే ఉండేవారు
- 1902లో రాజమండ్రికి వలస వెళ్లాం
- మా కుటుంబంలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చేసిన వారెవరూ లేరు
- ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి
1902లో తమ తాత గారు గుంటూరు జిల్లా ఉండవల్లి నుంచి రాజమండ్రికి వలస వచ్చారని, ఆ ఊరు నుంచి తాము రావడంతో తమ ఇంటిపేరు ‘ఉండవల్లి’ అయిందని అనుకుంటున్నానని ప్రముఖ రాజకీయ వేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ‘ఐ డ్రీమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఆరోజుల్లో రాజమండ్రి పెద్ద సిటీ. విజయవాడ చిన్నది. ఇప్పుడు రాజమండ్రి చిన్నదై పోయింది. ఉండవల్లి పెద్దదైపోయింది. కాలచక్రంలో మార్పులు తప్పవుగా. రాజధాని ప్రాంతమైన ఉండవల్లిలోనేగా చంద్రబాబుగారు ఉండేది. దీంతో, బాగా పాప్యులర్ అయింది. ఉండవల్లి గురించి రోజూ పేపర్లలో వస్తూనే ఉంటుందిగా! మా పూర్వీకులందరూ 16వ శతాబ్దం నుంచి ఉండవల్లిలోని అగ్రహారంలో ఉండేవారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు మాది.
మా నాన్న గారు మున్సిపల్ కౌన్సిలర్, రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపకుడు. ఆయనకు ప్రజలతో సంబంధాలు ఉండేవి. మా మదర్ రెడ్ క్రాస్ లో, గిల్డ్ ఆఫ్ సర్వీసులో యాక్టివ్ గా ఉండేవారు. ఆ రోజుల్లో రాజమండ్రిలో నివసించే ఉన్నత మధ్య తరగతి కుటుంబాల్లో మా కుటుంబం కూడా ఒకటి. మా కుటుంబంలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చేసిన వారెవరూ లేరు.
ఒకటో తరగతి నుంచి బి.కామ్ పూర్తయ్యే వరకు రాజమండ్రిలోనే చదువుకున్నా. బి.కామ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ‘లా’ ఏలూరులో పూర్తి చేశాను. చాలా గ్యాప్ తర్వాత లా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే.. అప్పటికే రాజకీయాల్లో నేను చాలా యాక్టివ్ గా ఉన్నాను. 1972-73 ఆంధ్రా యాజిటేషన్ సమయంలో మెయింటినెన్స్ ఆఫ్ ఇంటర్ సెక్యూరిటీ యాక్టు (మీసా) కింద విశాఖపట్టణం సెంట్రల్ జైల్లో 32 రోజులు ఉన్నాను. అప్పుడు నా వయసు 18 ఏళ్లు. ఆ సమయంలో పెద్ద పెద్ద రాజకీయనేతలతో పరిచయాలు ఏర్పడంతో రాజకీయాలపై మరింత ఆసక్తి కలిగింది. రాజకీయాల్లో ఉన్నానని చెప్పే లా కోర్సు చేశాను. అంతేతప్పా, లాయర్ గా పేరు సంపాదించడానికి కాదు. నా 50వ యేట నాకు ఎంపీ అయ్యే అవకాశం వచ్చింది’ అని చెప్పుకొచ్చారు.