Undavalli: నాడు వైఎస్ చెప్పిన ఆ స్టేట్ మెంట్ డ్రాఫ్ట్ చేసింది నేనే : ఉండవల్లి అరుణ్ కుమార్
- ఎలక్షన్ పాలిటిక్స్ నుంచి 60 ఏళ్లకు రిటైరవుతానన్న వైఎస్
- నాటి వ్యాఖ్యలను గుర్తు చేసుకున్న ఉండవల్లి
- ఎంపీగా పదేళ్లు పనిచేశాను..ఎటువంటి సంతృప్తి లేదు
- ‘ఐ డ్రీమ్స్’లో రాజకీయవేత్త ఉండవల్లి
ఎలక్షన్ పాలిటిక్స్ నుంచి అరవై ఏళ్లకు రిటైర్ అయిపోతానని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంట్రావర్షియల్ స్టేట్ మెంట్ ఒకటి ఉండేదని, ఆ స్టేట్ మెంట్ రాసింది తానేనని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ‘ఐ డ్రీమ్స్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘అరవై ఏళ్ల తర్వాత పార్టీలో పని చేయొచ్చు, అప్పర్ హౌస్ కు వెళ్లొచ్చు కానీ, ఎలక్షన్ పాలిటిక్స్ లో మాత్రం యువతనే పెట్టాలనే దానిని ఆయన (రాజశేఖర్ రెడ్డి) పూర్తిగా నమ్మారు. ఆయన చెప్పిందే నేను డ్రాఫ్ట్ చేస్తే ప్రెస్ కు విడుదల చేశారు.
నేను ఆయన (రాజశేఖర్ రెడ్డి) కన్నా ఒకడుగు ముందుకేసి .. నామినేటెడ్ పోస్ట్ ల్లోకి కూడా వెళ్లే ఉద్దేశం, ఆసక్తి కూడా నాకు లేవు. నేను పదేళ్లు ఎంపీగా చేశాను. దానిని పదవిగా నేను భావించలేదు. ఒక ఉద్యోగంగా భావించా. ఆ ఉద్యోగంలో నాకేమీ సంతృప్తి కలగలేదు. ఎంపీగా మొదటి ఐదు సంవత్సరాలు బాగానే ఉంది. ఆ తర్వాత ఐదేళ్లు సంతృప్తికరంగా అనిపించలేదు. అందుకు కారణం, పొలిటికల్ సీనే మారిపోయింది.
ఈ క్రమంలో జనరేషన్ గ్యాప్ వచ్చేసింది.. అవసరానికి మించి నేను ముసలోడినైపోయానేమోనని అనుకుంటూ ఉంటాను. నా వయసు వాళ్ల ఆలోచన కూడా నా ఆలోచనతో సరిపోవట్లేదు. సంతృప్తిలేని ఉద్యోగంలో ఎందుకు కొనసాగడం? కొనసాగడం వల్ల నాకు, ప్రజలకు ఏమీ ఉపయోగం లేదు. అందుకే, క్రమక్రమంగా తప్పుకుంటున్నాను. ఇంకో ఏడాదికో, రెండేళ్లకో ఈ ప్రెస్ మీట్స్ కూడా పెట్టను.. మానేస్తాను’ అని చెప్పుకొచ్చారు.