polavaram: ప్రభుత్వాలు ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తాయని నేను అనుకోలేదు!: ఉండవల్లి అరుణ్ కుమార్
- ఇప్పటికే చాలా ప్రెస్ మీట్లు పెట్టాను
- ఏ ఒక్క విషయంపైనా ప్రభుత్వం స్పందించలేదు
- ‘తప్పే చేయడం లేదు’ అనే ధీమాతో ఉన్నప్పుడు ఏం చేస్తాం?
- ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి
పోలవరం ప్రాజెక్ట్ కు సంధించిన అవినీతి ఆధారాలను బయటపెడితే ఎవరు పట్టించుకుంటారు? అని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ‘ఐ డ్రీమ్స్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ విషయమై ఇప్పటికే చాలా ప్రెస్ మీట్లు పెట్టానని, ఇందుకు సంబంధించిన ఒక్క విషయంపై కూడా ప్రభుత్వం స్పందించలేదని అన్నారు.
ప్రభుత్వానికి తాను పంపిన ప్రతి లెటర్ ని ‘ఆన్ లైన్’ ద్వారా మాత్రమే పంపిస్తానని, ‘మాకెక్కడ పంపావు?’ అని మళ్లీ ప్రభుత్వాధికారులు ప్రశ్నించకుండా ఉండేందుకే అలా పంపిస్తుంటానని అన్నారు. ‘నేను పంపిన లెటర్స్ కు ఏ అధికారీ సమాధానమివ్వకపోగా బూతులు తిట్టారు. సమాధానమివ్వనప్పుడు నేను లెటర్స్ పంపి ఏం ప్రయోజనం! మన తప్పేంటో మనం తెలుసుకోవాలనే ఆలోచన ఉంటే .. వాటిని చెప్పొచ్చు. ‘తప్పే చేయడం లేదు’ అనే ధీమాతో ఉన్నప్పుడు ఏం చేస్తాం?’ అని ప్రశ్నించారు.
‘పోలవరం’, రాజధాని 'అమరావతి’ గురించి అవినీతి బయటపెడుతుంటే, ప్రభుత్వాలు ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తాయని తాను అనుకోలేదని అన్నారు. తాను మాట్లాడే విషయాలపై ఎవరు ప్రతిస్పందించాలో వారు మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. ఫలానా చోట అన్యాయం జరుగుతోందని తాను చెబితే, ప్రభుత్వం ఎలాగూ స్పందించడం లేదని, కనీసం, ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా స్పందన కరువైందని అన్నారు.