Undavalli: చిన్నపిల్లాడు మారాం చేసినట్టుగా ఉంది వైసీపీ తీరు!: ఉండవల్లి అరుణ్ కుమార్
- ఈ ప్రతిపక్షపార్టీని గుర్తించనని చంద్రబాబు చెబుతూనే ఉన్నారు
- కౌంటర్ చేయడంలో ప్రతిపక్షం విఫలమైంది
- నా సలహాలు తీసుకునే పరిస్థితిలో జగన్ లేరు : ఉండవల్లి
ఏపీ అసెంబ్లీ సమావేశాలను వైసీపీ ఎమ్మెల్యేలు బహిష్కరించడంపై ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ మరోమారు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ఐ డ్రీమ్స్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ ఏ1, ఏ2, క్రిమినల్స్ ఉన్న ఈ ప్రతిపక్షపార్టీని గుర్తించనని చంద్రబాబు మొదటి నుంచి చెబుతున్నారు. రాజ్యాంగపరంగా అయితే, అలా అనేందుకు వీలులేదు. అదే విషయాన్ని చంద్రబాబు పదే పదే అంటుంటే, కౌంటర్ చేయడంలో ప్రతిపక్షం విఫలమైంది.
ప్రజలు అప్పజెప్పిన బాధ్యతను పక్కనపెట్టి, అసలు అసెంబ్లీకే వెళ్లమని వైసీపీ అనడం కరెక్టు కాదు. వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ తీసుకెళ్లింది కనుక, ఇక అసెంబ్లీకే వెళ్లమని వైసీపీ అనడం, చిన్నపిల్లాడు మారాం చేసినట్టుగా ఉంది. ఈ విషయాన్ని ప్రెస్ మీట్స్ ద్వారానే వైసీపీ వాళ్లకు చెప్పాను. ఆ పార్టీలో ఉన్న వాళ్లెవరితో నాకు అంత బాగా చనువు లేదు. జగన్ తో నాకు సన్నిహిత సంబంధం ఉన్నప్పటికీ, ఆయన బిజీగా ఉన్నారు. పైగా, జగన్ మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టినప్పుడు నేను వ్యతిరేకించాను. నా సలహాలు తీసుకునే పరిస్థితిలో జగన్ లేరు. ఆయనకు సంబంధించిన టీమ్ ఆయనకు ఉంది’ అని చెప్పుకొచ్చారు.