Undavalli: ఆ విషయాన్ని జగన్ ఎందుకు చెప్పుకోవడం లేదో నాకు అర్థం కావట్లేదు : ఉండవల్లి అరుణ్ కుమార్
- ఎవరైనా లంచం తీసుకుని, అందుకు రశీదు ఇవ్వడం ఉంటుందా?
- జగన్ తమ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారికి షేర్లు ఇచ్చి, రశీదులిచ్చాడు
- ఇది క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది?
- ప్రశ్నించిన ఉండవల్లి
జగన్ మోహన్ రెడ్డి చేసింది క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది? అని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. ‘ఐ డ్రీమ్స్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నాన్న సీఎం అయితే, కొడుకు వ్యాపారం చేయకూడదనేమీ లేదు. జగన్ ని బెనిఫీషియరి కింద పెట్టారు. రూ.1300 కోట్లు తీసుకొచ్చి జగన్ వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెట్టారు. లంచం తీసుకుంటున్న వాడెవడైనా ఆ లంచానికి రశీదు ఇస్తాడా? జగన్ మోహన్ రెడ్డి వాళ్లకు షేర్లు ఇచ్చి, రశీదులిచ్చాడు. జగన్ మనీ లాండరింగ్ చేశాడనో, ఈడీ రూల్స్ అతిక్రమించాడనో కేసులు పెడితే వేరుగా ఉండేది! ఇది క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది? డబ్బులు తీసుకుని దాచేసుకుంటే క్విడ్ ప్రోకో అవుతుంది. ఎవరైనా లంచం తీసుకుని, అందుకు రశీదు ఇవ్వడం ఉంటుందా? అనేది ఓ సామాన్యుడిగా నాకు వచ్చిన అనుమానం.
జగన్ మోహన్ రెడ్డి వాళ్లకు రశీదులిచ్చాడు కనుక దొరికాడు, లేకపోతే లేదుగా! వాళ్ల నాన్న చేసిన ఉపకారానికి జగన్ కు డబ్బులిచ్చారనుకోండి, ఆ డబ్బులను దాచుకుని 2014 ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఉంటే గెలిచేసేవాడు. వచ్చే ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు కూడా జగన్ మోహన్ రెడ్డి దగ్గర డబ్బులుండవు ! ఎందుకంటే, అతని దగ్గర ఉన్నదంతా వైటే.. బ్లాక్ ఏమీ లేదు.. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గురించి బయటపెట్టినవన్నీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లో రిజిస్టర్ అయి ఉన్నవే తప్ప, ఒక్క రూపాయి కూడా ఎక్కువ లేదు. ఆ విషయాన్ని ప్రజలకు ఇతను (జగన్) చెప్పుకోవడం లేదు! ఎందుకు చెప్పుకోవడం లేదో నాకు అర్థం కావట్లేదు. మన దగ్గర డబ్బులేదని ప్రజలకు తెలిసిపోతే ప్రమాదమని జగన్ అనుకుంటున్నాడేమో!’ అని చెప్పుకొచ్చారు.