KCR: అందుకే, మమతా బెనర్జీతో కేసీఆర్ భేటీ అయ్యారు: ఉత్తమ్‌కుమార్ రెడ్డి
- మమతా బెనర్జీని కేసీఆర్ కలవడం ఒక స్టంట్ మాత్రమే
- ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నంలో భాగమే
- తెలంగాణలో బడ్జెట్ సమావేశాలను నామమాత్రంగా నడుపుతున్నారు
- టీఆర్ఎస్ పాలనలో కమీషన్లు సర్వసాధారణమయ్యాయి
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలవడం ఒక స్టంట్ మాత్రమేనని, ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నంలో భాగమేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బడ్జెట్ సమావేశాలను నామమాత్రంగా నడుపుతూ, మరోవైపు కేసీఆర్ కోల్‌కతాలో పర్యటిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా ఒక్కరూ గెలవరని అన్నారు.
టీఆర్ఎస్ పాలనలో కమీషన్లు సర్వసాధారణమయ్యాయని, ఈ విషయాన్ని సిరిసిల్ల మున్సిపల్ ఛైర్మనే చెప్పారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబం బాటలోనే టీఆర్ఎస్ నేతలు కూడా నడుస్తూ ప్రతి పనిలో కమీషన్లు అడుగుతున్నారని ఆరోపించారు. సిరిసిల్లలో జరుగుతోన్న అవినీతికి నైతిక బాధ్యత వహించి తెలంగాణ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని, మంత్రిగా కొనసాగే అర్హత ఆయనకు లేదని వ్యాఖ్యానించారు.