Inter: కాలేజీ హాస్టల్ లో గదికి ఇద్దరే... 10 తరువాత పడుకోవాల్సిందే: విద్యార్థుల మేలు కోసం తెలంగాణ ఇంటర్ బోర్డు ఆదేశాలు
- అరకొర వసతులతో హాస్టళ్లు
- ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు
- ఇంటర్ కాలేజీలకు కొత్త మార్గదర్శకాలు
- మీరితే కఠిన చర్యలు తప్పవన్న అధికారులు
అరకొర వసతులు ఉన్న హాస్టళ్లలో ఉంటూ ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ ఒత్తిడికి గురవుతూ చదవలేక చదువుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న విద్యార్థినీ విద్యార్థుల మేలు కోసం తెలంగాణ ఇంటర్ బోర్టు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫీజుల పేరిట లక్షల రూపాయలు దండుకుంటూ, కనీస మౌలిక వసతులు కల్పించని యాజమాన్యాలపై కఠిన చర్యలకు దిగనుంది. ఇంటర్ కాలేజీలకు మార్గదర్శకాలు విడుదల చేస్తూ, వాటిని మీరితే కొరడా ఝళిపిస్తామని హెచ్చరించింది.
ఇక ప్రధాన నిబంధనలను పరిశీలిస్తే, హాస్టల్ గదిలో ఇద్దరు మాత్రమే ఉండాలి. 8 మంది బాలురకు ఒకటి, ఆరుగురు బాలికలకు ఒకటి బాత్ రూము తప్పనిసరి. ఒక్కో విద్యార్థికి 50 చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఉదయం 6 గంటలలోపు నిద్రలేపకూడదు. రాత్రి 10 గంటల తరువాత స్టడీ అవర్స్ ఉండరాదు. 360 మంది విద్యార్థులు ఓ యూనిట్ గా ఉండాలి. యూనిట్ లో ఆరుగురు వంట సిబ్బంది తప్పనిసరి. భోజనం నాణ్యంగా ఉండాలి. ఫుడ్ ఇనస్పెక్టర్ నేతృత్వంలో నిరంతరం పర్యవేక్షించాలి. నెలకోసారి పేరెంట్, టీచర్ సమావేశం తప్పనిసరి. సెలవులు ఇస్తే విద్యార్థులను కలుసుకునే అవకాశం తల్లిదండ్రులకు కల్పించాలి. ఈ నిబంధనలు ప్రైవేటు రెసిడెన్షియల్ కళాశాలలతో పాటు ప్రభుత్వ కాలేజీలకూ వర్తిస్తాయి.