Sushma Swaraj: కనీస మానవత్వమైనా లేదా?: టీఆర్ఎస్, అన్నాడీఎంకే సభ్యులపై సుమిత్రా మహాజన్ మండిపాటు
- సుష్మా స్వరాజ్ ను మాట్లాడనివ్వని టీఆర్ఎస్, అన్నాడీఎంకే
- మరణించిన వారికి గౌరవం ఇవ్వరా?
- స్పీకర్ సుమిత్రా మహాజన్ కీలక వ్యాఖ్య
ఇరాక్ లో 39 మంది భారతీయులను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు చంపేశారన్న విషయాన్ని లోక్ సభకు తెలియజేయాలని సుష్మా స్వరాజ్ మాట్లాడుతున్న వేళ, వెల్ ను ఖాళీ చేయకుండా, తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ప్లకార్డులు పట్టుకున్న టీఆర్ఎస్ ఎంపీలపై స్పీకర్ సుమిత్రా మహాజన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రిజర్వేషన్లను సవరించుకునే అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
మరోపక్క, కావేరీ నదీ బోర్డును తక్షణం ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే సభ్యులు సైతం వెల్ లో నినాదాలు చేశారు. వీరిని ఎంతగా సముదాయించి సీట్లలోకి పంపాలని చూసినా వినేలేదు. దీంతో ఒకింత సహనాన్ని కోల్పోయిన ఆమె, ఈ తరహా తీరు సరికాదని, కనీసం మానవత్వం చూపించాలని, మరణించిన వారికి కూడా గౌరవం ఇవ్వరా? అని ప్రశ్నించారు. సభ్యులు నిరసనలు ఆపితే విదేశాంగ మంత్రి కీలక ప్రకటన చేస్తారని చెప్పారు. అయినా ఎవరూ వినకపోగా, నినాదాల మధ్యే సుష్మా స్వరాజ్ తాను చెప్పాలనుకున్న అంశాన్ని చెప్పారు.