Vijay Sai Reddy: జగన్ కు గుడ్ బై చెప్పనున్న వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. విజయసాయిరెడ్డే కారణం?
- గత కొంత కాలంగా వైసీపీకి దూరంగా ఉన్న ప్రశాంత్ కిషోర్
- పీకే టీమ్ సూచనలకు విలువ ఇవ్వని విజయసాయిరెడ్డి, జగన్ బంధువులు
- విజయసాయితో మీటింగ్ అంటేనే భయపడుతున్న పీకే టీమ్
వైసీపీ అధినేత జగన్ కు రాజకీయ వ్యూహకర్త, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్) ఛైర్మన్ ప్రశాంత్ కిశోర్ తీవ్ర అసహనంతో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించే విషయంలో గుడ్ బై చెప్పేందుకు ఆయన సిద్ధమయ్యారని సమాచారం. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ ను జగన్ తీసుకొచ్చారు. పార్టీలోని సీనియర్ నేతల కంటే ఎక్కువ ప్రాధాన్యతను ఆయనకు ఇచ్చారు. అలాంటి ప్రశాంత్ కిషోర్ వైసీపీ వ్యవహారాలకు దూరంగా, మౌనంగా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికంతటికీ కారణం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అని చెబుతున్నారు.
వైసీపీకి దూరంగా ఉన్న ప్రశాంత్ కిషోర్... వైసీపీ బాధ్యతలను తన ప్రధాన అనుచరుడు రిషీకి అప్పగించారని అంటున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా వెళ్తున్న పీకే... బీజేపీకి వైసీపీని దగ్గర చేయాలని భావించారట. పీకే చెబుతున్న సలహాలను అమలు చేయాలని జగన్ చెబుతున్నప్పటికీ... విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో పని చేసే పీకే అనుచరులు వాటిని అమలు చేయలేకపోతున్నారట. విజయసాయిరెడ్డి జోక్యం, ఆధిపత్యం పెరిగిపోవడంతో... పీకే టీమ్ లోని ఒక్కొక్కరు ఐప్యాక్ కు రాజీనామా చేస్తున్నట్టు సమాచారం.
మరోవైపు పీకేతో పాటు, రిషిని కూడా విజయసాయిరెడ్డితో పాటు, జగన్ బంధువులు ఇద్దరు లెక్కచేయడం లేదట. దీంతో, వీరితో సమావేశం అంటేనే పీకే టీమ్ వణికిపోతున్నారట. ఈ ముగ్గురికీ రాజకీయాలపై పూర్తి అవగాహన లేదని... వీరి వల్ల పీకే ఇమేజ్ కు డ్యామేజ్ జరుగుతుందని ఐప్యాక్ కు సమాచారం ఇచ్చారట. ప్రత్యేక హోదా విషయంలో పీకే ఇచ్చిన సలహాలను కూడా వీరు పట్టించుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలో, వైసీపీకి గుడ్ బై చెప్పే దిశగా పీకే అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. మరి ఏం జరగబోతోందో కొన్నాళ్లు వేచి చూడాలి.