Brazil: బ్రెజిల్‌ను ముంచేస్తున్న వరదలు.. బొమ్మల్లా కొట్టుకుపోతున్న కార్లు!
- గత కొన్ని రోజులుగా బ్రెజిల్‌లో వరద బీభత్సం
- జనజీవనం అస్తవ్యస్తం
- 20 నిమిషాల్లో 49 మిల్లీ లీటర్ల వర్షపాతం నమోదు
గతంలో ఎన్నడూ లేనంతగా బ్రెజిల్‌లో వరదలు ముంచెత్తాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు బెలో హారిజోంటీ తడిసి ముద్దవుతోంది. బలంగా వీస్తున్న గాలులకు విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. కొండచరియలు విరిగిపడుతున్నాయి. చెట్లు కూకటివేళ్లతో సహా కూలిపోతున్నాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. వరద నీట్లో వాహనలు బొమ్మల్లా కొట్టుకుపోతున్నాయి.
ఇక వరద నీటితో నిండిపోయిన లోతట్టు ప్రాంతాలు, రోడ్లు నదుల్లా మారాయి. కేవలం 20 నిమిషాల్లోనే 49 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదు అయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం వరద ఉద్ధృతి కొంత తగ్గుముఖం పట్టినా వర్షాలు మాత్రం ఆగడం లేదు. బలమైన ఈదురు గాలులు ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. వరదలు ముంచెత్తుతున్నా అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదని, ఇద్దరు వ్యక్తులు మాత్రం గాయపడ్డారని అధికారులు తెలిపారు.